Jammi Chettu : మనం కొన్ని రకాల చెట్లను పూజిస్తూ ఉంటాం. అలాంటి వాటిలో జమ్మి చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు ఎంతో విశిష్టత కలిగిన చెట్టు. జమ్మి చెట్టు శని భగవానునికి ఎంతో ప్రీతికరమైనది. జమ్మి చెట్టు శత్రువులను నాశనం చేసి విజయాన్ని కలింగే చెట్టని మన పెద్దలు చెబుతుంటారు. ఈ చెట్టు రసం చేదు, వగరు, కారం రుచులను కలిగి విరేచనాలను కలిగించే గుణాన్ని కలిగి ఉంటుంది. వీటిలో చిన్న జమ్మి చెట్టు, పెద్ద జమ్మి చెట్టు అని రెండు రకాలు ఉంటాయి. ఇవి రెండూ కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
జ్వరం, అరుచి, చర్మ రోగాలు, క్రిమి రోగాలను ఈ చెట్టు పోగొడుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడే వారు జమ్మి చెట్టు ఆకులను దంచి పొడిగా చేసి జల్లించి నిల్వ చేసుకోవాలి. రోజూ ఉదయాన్నే ఈ పొడిని రెండు గ్రాముల మోతాదులో తీసుకుని వెంటనే ఒక గ్లాసు ఆవు పాలను తాగడం వల్ల ఉదర సంబంధమైన సమస్యలన్నీ తగ్గుతాయి. ఆహార సేవనం వల్ల కలిగే విషాలను హరించడంలో ఈ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. జమ్మి చెట్టు ఆకులను, కాయలను సేకరించి ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజూ ఉదయం 20 బియ్యం గింజల పరిమాణంలో తేనెతో కలిపి మూడు రోజుల పాటు తీసుకోవడం వల్ల ఆహార సేవనం వల్ల కలిగే విషాలు తొలగిపోతాయి.
దంతాలు కదిలి బాధపెడుతున్నప్పుడు ఈ చెట్టు ఆకుల రసాన్ని కానీ, చెక్క రసాన్ని కానీ 5 నుండి 6 చుక్కల మోతాదులో కదులుతున్న దంతంపై పోయాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గి దంతం తొలగించడం సులభతరం అవుతుంది. జమ్మి చెట్టు ఆకుల ముద్దను వ్రణాలపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల పురుగులు పడిన వ్రణాలు కూడా తగ్గుతాయి.
పురుషులు జమ్మి చెట్టు గింజల చూర్ణాన్ని పాలలో కలుపుకుని తాగడం వల్ల వీర్య వృద్ధి కలుగుతుంది. జమ్మి చెట్టు గాలి శరీరానికి తగలడం వల్ల శరీరంలో ఉండే సర్వ విషాలు తొలగిపోతాయి. త్రిదోషాలను నివారించడంలో జమ్మి చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. జమ్మి చెట్టు చుట్టూ క్రమం తప్పకుండా ప్రదక్షిణలు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.