Amla Leaves : ఉసిరి చెట్టు.. ఇది మనందరికి తెలిసిందే. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మొక్కలల్లో ఉసిరి చెట్టు ఒకటి. ఈ ఉసిరి కాయలను ఇంగ్లీష్ లో గూస్ బెర్రీ అని, హిందీలో ఆమ్లా అని పిలుస్తారు. ఈ చెట్టు ఆకులు చిన్నగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఉసిరి చెట్టు హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. ఉసిరి చెట్టుకు కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటాము. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు కూడా చేస్తూ ఉంటారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్య పరంగా కూడా ఉసిరి చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉసిరి కాయలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఉసిరికాయలను తాజాగా తీసుకున్నా లేదా జ్యూస్ చేసి తీసుకున్నా, వరుగులుగా చేసి తీసుకున్నా కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
కేవలం ఉసిరికాయల్లోనే కాదు ఉసిరి చెట్టు ఆకుల్లో, వేర్లు, బెరడులోనూ ఔషధ గుణాలు ఉన్నాయి. అజీర్తి, గ్యాస్, మలబద్దకం, కడుపునొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు ఉసిరి ఆకులను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఉసిరి చెట్టు ఆకులను జ్యూస్ గా చేయాలి. ఈ జ్యూస్ ను 10 ఎమ్ ఎల్ మోతాదులో తీసుకుని మజ్జిగలో కానీ పెరుగులో కానీ కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలన్నీ తగ్గుతాయి. ఉసిరి చెట్టు ఆకుల్లో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఉసిరి చెట్టు ఆకులు మనకు ఉపయోగపడతాయి. ఈ ఉసిరి ఆకుల జ్యూస్ ను ప్రతిరోజూ కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.
నోటిపూత, నోటిలో అల్సర్లు వంటి సమస్యలతో బాధపడే వారు నీటిలో ఉసిరి ఆకులను వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి అందులో ఉప్పును కలిపి నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నోటి సంబంధిత సమస్యలతో పాటు గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్ లు వంటి సమస్యలు తగ్గుతాయి. ఉసిరి ఆకులతో చేసిన కషాయంతో గాయాలను, దెబ్బలను కడగడం వల్ల అవి త్వరగా మానుతాయి. ఉసిరి ఆకులను కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిదకు ఆవ నూనెను కలిపి చర్మ సమస్యలు ఉన్న చోట లేపనంగా రాయాలి. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. ఉసిరికాయలను మెత్తగా నూరి ఫేస్ ప్యాక్ గా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఉసిరి ఆకులతో చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల కాలేయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
కాలేయంలోని మలినాలు తొలగిపోయి కాలేయం శుభ్రపడుతుంది. కామెర్ల వ్యాధితో బాధపడే వారు రోజూ ఉదయం పరగడుపున ఉసిరి ఆకుల రసాన్ని తగిన మోతదులో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కళ్లు ఎర్రగా మారడం, కళ్లు మండడం, కంటిలో దురదలు, కళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడే వారు కూడా ఈ ఆకులతో చేసిన కషాయంతో కళ్లను కడగడం వల్ల సమస్యలు తగ్గడంతో పాటు కంటిచూపు కూడా మెరుగుపడుతుంది. 10 గ్రాముల ఉసిరి ఆకులకు, ఉప్పును కలిపి మెత్తగా నూరి చప్పరిస్తూ ఉంటే గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గి ఆకలి పెరుగుతుంది. ఉసిరి ఆకులతో పాటు ఉసిరి బెరడును కలిపి కషాయంలా చేసి ఆ కషాయంతో జుట్టును కడుగుతూ ఉంటే చుండ్రు సమస్యలు తగ్గి జుట్టు కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. 10 గ్రాముల ఉసిరి చెట్టు బెరడును తీసుకుని పొడిగా చేయాలి.
ఈ పొడికి సమానంగా తేనెను కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. గొంతులో పేరుకున్న కఫం కూడా తొలగిపోతుంది. అలాగే వాస్తు దోషాలను తొలగించడంలో కూడా ఉసిరి చెట్టు మనకు ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉసిరి చెట్టు ఉండడం వల్ల ఎల్లప్పుడూ మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈవిధంగా ఉసిరికాయలతో పాటు ఉసిరి చెట్టు ఆకులు, బెరడు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని వీటిని వాడడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.