మన చుట్టూ పరిసరాల్లో మర్రి చెట్లు ఎక్కువగానే ఉంటాయి. పట్టణాలు, నగరాల్లో కాదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. మర్రి చెట్టునే వట వృక్షం అని కూడా అంటారు. ఇంగ్లిష్‌లో బనియన్ ట్రీ అని, హిందీలో బర్గద్ అని పిలుస్తారు. మర్రి చెట్టుకు చెందిన వేర్లు, కాండం, ఆకులు, చిగుళ్లు, పువ్వులు అన్నీ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటితో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మర్రి చెట్టు వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* మర్రి లేత ఆకులు లేదా ఊడల చిగుళ్ళను 5 లేదా 6 తీసుకోవాలి. అలాగే ఎర్ర కందిపప్పును 10-20 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. రెండింటినీ నీటితో కలిపి మెత్తగా నూరాలి. ఈ ముద్దను ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వేసుకోవచ్చు. కొంత సేపటి తరువాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.
* మర్రి ఆకుల పాలు, ఆవాల నూనెలను 2 చుక్కల మోతాదులో తీసుకుని కలిపి ఆ మిశ్రమాన్ని 2 చుక్కల చొప్పున చెవిలో వేస్తుంటే చెవి నొప్పి తగ్గుతుంది. చెవిలో ఉండే పురుగులు చనిపోతాయి. ఆవాల నూనెకు బదులుగా మేకపాలను కూడా వాడుకోవచ్చు.
* లేత మర్రి ఆకుల రసంలో ఆవాల నూనె కలిపి దాన్ని వేడి చేసి సీసాలో నిల్వ చేయాలి. దాన్ని రోజూ జుట్టుకు రాసుకుంటుండాలి. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు తగ్గుతాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.
* మర్రి పాలను నొప్పి ఉన్న దంతం కింద రాయాలి. దీంతో దంతాల నొప్పి తగ్గుతుంది. అలాగే మర్రి చెట్టు ఊడ గట్టిది చూసి తెంపి దాంతో దంతాలను తోముకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
* లేత మర్రి ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. ఒకటిన్నర టీస్పూన్ల పొడిని 1 లీటర్ నీటిలో వేసి మరిగించాలి. ఇది పావు లీటర్‌కు రాగానే దించి 3 టీస్పూన్ల చక్కెర కలిపి తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగుతుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
* లేత మర్రి కొమ్మలను విరిచి 20 గ్రాముల మేర దంచి చల్లని నీటిలో కలిపి తాగాలి. దగ్గు తగ్గుతుంది.
* మర్రి చెట్టు బెరడును 20 గ్రాముల మోతాదులో తీసుకుని దాన్ని 400 ఎంఎల్ నీటిలో వేసి మరిగించాలి. నీరు సగం ఆవిరయ్యాక దించి దాన్ని వడగట్టి కొద్దిగా చక్కెర, నెయ్యి కలిపి తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు తాగితే పైల్స్ తగ్గుతాయి.
* లేత మర్రి ఆకులతో కషాయం తయారు చేసి అందులో కొద్దిగా చక్కెర కలిపి తాగుతుంటే వాంతులు తగ్గుతాయి.
* 20 గ్రాముల పచ్చని మర్రి ఆకులు, 7 లవంగాలను కలిపి మెత్తగా నీటిలో వేసి నూరి దాన్ని వడకట్టగా వచ్చిన ద్రవాన్ని తాగాలి. వికారం తగ్గుతుంది.
* మర్రి చెట్టు బెరడు, దాని లేత ఊడలు కలిపి మెత్తగా పొడి చేయాలి. 20 గ్రాముల పొడిని అర లీటర్ నీటిలో వేసి మరిగించి అది 1/8 వ వంతుకు రాగానే దాన్ని వడకట్టి రోజూ రెండు పూటలా తాగాలి. ఇలా నెల రోజులు చేస్తే షుగర్ తగ్గుతుంది.
* మర్రి ఆకుల లేత ఊడల పొడిని రోజూ 4 గ్రాములు రెండు పూటలా నీటితో తీసుకోవాలి. లేదా 10 – 20 గ్రాముల మర్రి పండ్లను పటిక బెల్లంతో కలిపి పాలతో కలిపి తీసుకోవాలి. దీంతో పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది. మూత్ర సంబంధ వ్యాధులు పోతాయి.
* 10 గ్రాముల లేత మర్రి ఊడలను 100 ఎంఎల్ పాలలో కలిపి నూరి దాన్ని వడగట్టి తాగాలి. దీనివల్ల స్త్రీలలో అధిక రుతు స్రావం, ఇతర సమస్యలు తగ్గుతాయి.
* గాయం వల్ల రక్తం కారుతుంటే రక్తం ఆగడానికి మర్రిపాలను దానిపై రాయాలి.
* మర్రి చెట్టు బెరడును నీడలో ఎండనిచ్చి చూర్ణం చేయాలి. దానికి సమానంగా పటికబెల్లం కలపాలి. ఆ మిశ్రమాన్ని రోజూ ఉదయం వేడిగా ఉండే ఆవుపాలతో తీసుకోవాలి. దీంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
* గాయాలు, పుండ్లపై మర్రిపాలను పోస్తుంటే అవి త్వరగా మానుతాయి. ఇన్ఫెక్షన్ రాదు.
* మర్రి ఆకులపై నువ్వుల నూనె రాసి వాటిని ట్యూమర్ ఉన్న చోట ఉంచి కట్టుకట్టాలి. దీంతో గడ్డ కరిగిపోతుంది. కొవ్వు గడ్డలకు ఇది పనిచేస్తుంది.
* మర్రి ఆకులపై కొద్దిగా నెయ్యి రాసి వాటిని వాపులున్న చోట ఉంచి కట్టు కట్టాలి. దీంతో వెంటనే వాపులు, నొప్పులు తగ్గుతాయి.