Banyan Tree : ఈ భూమి మీద ఉండే మహా వృక్షాల్లో మర్రి చెట్టు ఒకటి. మర్రి చెట్టు తెలియను వారు ఉండరనే చెప్పవచ్చు. అలాగే మర్రి చెట్టు ఉండని గ్రామం కూడా ఉండదు. మర్రిచెట్టును ఉపయోగించుకున్న వారు కూడా అనంతమైన దీర్ఘాయుష్షును కూడా పొందవచ్చని మన మహర్షులు ఏనాడో తెలియజేసారు. మర్రిపండ్లు తినే కాకులు కూడా 100 ఏళ్లు బ్రతుకుతాయని కూడా మన పెద్దలు అంటుంటారు. మర్రి చెట్టును ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మర్రి చెట్టులో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మర్రి చెట్టును సంస్కృతంలో వట, క్షీరి అని హిందీలో బూహద్ అని, ఇంగ్లీష్ లో బనియన్ ట్రీ అని పిలుస్తారు.
మర్రి చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మర్రిచెట్టును ఉపయోగించి జ్వరాన్ని, మూత్ర వ్యాధులను, చర్మరోగాలను, లైంగిక సమస్యలతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మర్రి ఊడలు 5 నుండి 10 గ్రాముల మోతాదులో తీసుకుని శుభ్రంగా కడిగి తినడం వల్ల పురుషుల్లో వచ్చే శీఘ్రస్కలనం, మూత్రంలో వీర్యం పడిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ ఊడలను ఎండబెట్టి పొడిగా చేసి జల్లించి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రెండు పూటలా పూటకు ఒక స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల స్త్రీలల్లో వచ్చే అన్ని రకాల యోని సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఈవిధంగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.

చర్మం కూడా అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. లేత మర్రి ఊడలను తీసుకుని మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని స్త్రీలు రాత్రి పడుకునే ముందు చను మొదలు వదిలి రొమ్ములకు రాసి కట్టుకట్టాలి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తొలగించి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల స్త్రీలల్లో స్థనాలు బిగుతుగా తయారవుతాయి. మర్రి ఊడలను నీటిలో వేసుకుని కషాయంలా చేసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల పైత్యం తగ్గి జ్వరం కూడా తగ్గుతుంది. మర్రి చెట్టు లేత ఊడల రసాన్ని 10 గ్రాముల మోతాదులో తీసుకుని దానిలో 5 మిరియాల పొడిని కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల చర్మ రోగాలు, మేహ రోగాలు, కుష్టు రోగాలు హరించుకుపోతాయి. ఎర్రగా ఉండే మెత్తని మర్రి చెట్టు చిగుళ్లను తీసుకుని నీడలో ఎండబెట్టి పొడి చేయాలి.
ఈ పొడిని అర టీ స్పూన్ మోతాదులో తీసుకుని పావు లీటర్ కషాయం మిగిలే వరకు చిన్న మంటపై బాగా మరిగించాలి. తరువాత దీనిని వడకట్టి తగినంత కండచక్కెర కలుపుకుని వేడిగా ఉదయం, సాయంత్రం తాగుతూ ఉండాలి. ఇలా తీసుకోవడం వల్ల మెదడుకు బలం కలుగుతుంది. తలలో పేరుకుపోయిన కఫం హరించుకుపోయి తుమ్ములు ఆగి పోతాయి. ముదురు మర్రి ఆకులను తీసుకుని మెత్తగా పొడి చేయాలి. ఈ పొడిని అర టీ స్పూన్ మోతాదులో ఒక లీటర్ నీటిలో వేసి పావు లీటర్ కషాయం అయ్యే వరకు బాగా మరిగించాలి. ఈ కషాయంలో మూడు చిటికెల ఉప్పు వేసి కలిపి ఉదయం, సాయంత్రం తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల నిద్రలో పీడకలలు, నిద్రలేమి, నిద్రలో భయం వంటి సమస్యలు తగ్గి చక్కగా నిద్ర పడుతుంది.
10 గ్రాముల లేత మర్రి ఆకులను తీసుకుని 150 గ్రాముల నీటితో కలిపి మెత్తగా నూరాలి. తరువాత దీనిని వడకట్టుకుని దానిలో కలకంద కలుపుకుని రెండు పూటలా తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల గుండె దడ పూర్తిగా తగ్గుతుంది. లేత మర్రి పువ్వులను 10 గ్రాముల మోతాదులో తీసుకుని నీటితో కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి దానికి తగినంత కండచక్కెర కలిపి రెండు పూటలా తాగాలి. ఇలా చేయడం వల్ల విరోచనాలు తగ్గుతాయి. లేత మర్రి ఆకులను 25 గ్రాముల మోతాదులో తీసుకుని నీటితో కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి తాగుతూ ఉంటే రక్తవిరోచనాలు, మొలలు వంటి సమస్యలు తగ్గుతాయి. 10 గ్రాముల లేత మర్రి మొగ్గలను, దేశవాళి వంకాయతో కలిపి మెత్తగా నూరి తింటూ ఉంటే నడుము నొప్పితో పాటు శరీరంలో ఇతర నొప్పులు కూడా తగ్గుతాయి.
మర్రి ఆకులను నీటిలో వేసి కషాయం చిక్కబడే వరకు చిన్న మంటపై మరిగించాలి. తరువాత ఈ కషాయాన్ని వడకట్టి తగినంత కలకండ కలిపి తీసుకుంటే పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారు మర్రి చెట్టు ఆకుల పొడిని రెండు పూటలా పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుని మంచి నీటిలో వేసి కలిపి తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల అన్ని రకాల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇవే కాకుండా మర్రి చెట్టును ఉపయోగించడం వల్ల మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని దీనిని ఉపయోగించడం వల్ల దీర్ఘాయుష్షువును కూడా సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.