Moduga Chettu : చెట్లను పూజించే సంస్కృతిని మనం భారత దేశంలో మాత్రమే చూడవచ్చు. భారతీయులు అనేక రకాల చెట్లను పూజిస్తూ ఉంటారు. ఇలా పూజించే చెట్లల్లో మోదుగ చెట్టు కూడా ఒకటి. రావి చెట్టును, వేప చెట్టును పూజించినట్టుగానే మోదుగ చెట్టును కూడా పూజిస్తూ ఉంటారు. ఇంట్లో చెడు తొలగి పోయి మంచి జరగాలని చేసే హోమాలలో, యాగాలలో మోదుగ చెట్టు కొమ్మలను ఉపయోగిస్తూ ఉంటారు. మోదుగ పూలను అగ్ని పూలు, ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు.
ఫిబ్రవరి, మార్చి నెలల్లో మాత్రమే ఈ పూలు పూస్తాయి. పూర్వ కాలంలో ఈ పూల నుండి తయారు చేసే రంగును హోళి వేడుకల్లో చల్లుకునే వారు. మోదుగ చెట్టులో ప్రతి భాగం ఎన్నో ఔషధ విలువలను కలిగి ఉంటుంది. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిచడంలో, అనేక రకాల ఔషధాలను తయారు చేయడంలో మోదుగ చెట్టు ఎంతో సహాయపడుతుంది.

కడుపులో ఉండే నులిపురుగులను, బద్దె పురుగులను తొలగించడంలో మోదుగ చెట్టు గింజలు ఎంతో ఉపయోగపడతాయి. మోదుగ చెట్టు ఆకుల రసాన్ని మనం మౌత్ వాష్ గా కూడా వాడవచ్చు. ఆయుర్వేద నిపుణులు మోదుగ చెట్టు ఆకు చిగుర్లను ఉపయోగించి నోటిలో వచ్చే అల్సర్లను నయం చేస్తారు.
పూర్వ కాలంలో విస్తర్ల తయారీలో మోదుగ చెట్టు ఆకులను ఉపయోగించే వారు. ఈ చెట్టు ఆకులతో చేసిన విస్తర్లలో వేడి వేడి అన్నం తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మోదుగచెట్టుతో చేసిన ఔషధాలను సరైన మోతాదులో తీసుకోవడం వల్ల జీవిత కాలం (ఆయుర్దాయం) పెరుగుతుందని ఆయుర్వేద గ్రంథాలు తెలియజేస్తున్నాయి.