రావి చెట్టు. దీన్నే బోధి వృక్షం అంటారు. హిందుయిజంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆయుర్వేదంలో ఎంతో కాలం నుంచి రావి చెట్టు భాగాలను ఉపయోగిస్తున్నారు. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ చెట్టు రాత్రి పూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని చెబుతారు. దీన్నే ట్రీ ఆఫ్ లైఫ్ అని కూడా అంటారు. ఆయుర్వేద ప్రకారం రావి చెట్టు వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. రావి చెట్టు బెరడు, బాగా పండిన పండ్లు ఆస్తమాను తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. రావి చెట్టు బెరడును పొడి చేసి దాని పండ్లతో కలిపి మిశ్రమంగా చేయాలి. ఈ మిశ్రమాన్ని రోజూ మూడు సార్లు తీసుకుంటే ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. రావి చెట్టు పండ్లను నీడలో ఎండబెట్టి పొడి చేయాలి. దాన్ని ఒక గ్లాస్ నీటితో రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇలా 14 రోజుల పాటు చేస్తే ఆస్తమా తగ్గుతుంది.
2. ఆకలి లేని వారు బాగా పండిన రావి చెట్టు పండ్లను తింటుంటే ఆకలి బాగా పెరుగుతుంది. జీర్ణాశయంలో మంట తగ్గుతుంది.
3. జీర్ణ సమస్యలను తగ్గించడంలో రావి చెట్టు ఆకులు బాగా పనిచేస్తాయి. రావి చెట్టు ఆకులు 2-3 తీసుకుని పేస్ట్‌లా చేయాలి. 50 గ్రాముల బెల్లంతో ఆ పేస్ట్‌ను కలిపి ట్యాబ్లెట్లలా తయారు చేసుకోవాలి. వాటిని ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున తీసుకుంటుంటే కడుపు నొప్పి తగ్గుతుంది.
4. రావి చెట్టు బెరడు సేకరించి దాంతో కషాయం కాచి తాగుతుంటే ఎగ్జిమా, దురదలు తగ్గుతాయి. లేదా బెరడును కాల్చి బూడిద చేసి దాన్ని 50 గ్రాముల మోతాదులో తీసుకుని నిమ్మరసం, నెయ్యితో కలిపి పేస్ట్‌లా చేసి దాన్ని దురద ఉన్న చోట రాయాలి. గజ్జి, దురద తగ్గుతాయి.
5. రావి చెట్టు బెరడు పొడి, శనగ పిండిలను కలిపి అందులో నీరు పోసి పేస్ట్‌లా చేయాలి. దాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌లా రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
6. రావి చెట్టు ఆకులను సేకరించి వాటిని పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్రమాన్ని పాదాలకు రాస్తుంటే పాదాల పగుళ్లు తగ్గుతాయి. పాదాలు అందంగా మారుతాయి.
7. రావి చెట్టు బెరడు, మర్రి చెట్టు బెరడులను నీటిలో వేసి మరిగించాలి. ఆ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని పుక్కిలిస్తుండాలి. దీంతో దంతాలు, చిగుళ్ల నొప్పి తగ్గుతాయి.
8. బాగా పండిన రావి చెట్టు పండ్లను రోజూ తింటుంటే మలబద్దకం తగ్గుతుంది.
9. రావి చెట్టు మృదువైన కాండం, ధనియాలు, చక్కెరలను సమాన భాగాల్లో తీసుకుని మిశ్రమంగా చేసి దాన్ని 3-4 గ్రాముల మోతాదులో రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. విరేచనాలు తగ్గుతాయి.
10. రావి చెట్టు పండ్లలోని విత్తనాలను 1-2 గ్రాముల మోతాదులో తీసుకుని వాటిని తేనెతో కలిపి తింటుండాలి. రక్తం శుద్ధి అవుతుంది.
11. రావి చెట్టు ఆకులను రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఆకులను తీసేసి ఆ నీటిని మూడు పూటలా తాగాలి. ఇలా చేస్తుంటే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
12. రావి చెట్టు ఆకుల నుంచి రసం తీసి దాన్ని 2-3 చుక్కల మోతాదులో చెవిలో వేయాలి. దీంతో చెవి ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది.
13. రావి చెట్టు పండ్లను నీడలో ఎండ బెట్టి పొడి చేయాలి. దీన్ని అర టీస్పూన్ మోతాదులో రోజు పాలతో మూడు సార్లు తీసుకోవాలి. పురుషులకు ఇది మేలు చేస్తుంది. వారిలో ఉండే నపుంసకత్వ సమస్య తగ్గుతుంది.