Jamun Leaves : ఏడాదిలో మనకు మూడు సీజన్లు ఉంటాయి. చలికాలం, వేసవి, వర్షాకాలం. ఈ మూడు సీజన్లలోనూ మనకు భిన్నమైన పండ్లు లభిస్తుంటాయి. కొన్ని మాత్రం ఏడాది పొడవునా సీజన్లతో సంబంధం లేకుండా లభిస్తాయి. ఇక వేసవి అనంతరం వచ్చే సీజన్‌లో లభించే పండ్లు కూడా కొన్ని ఉంటాయి. వాటిల్లో నేరేడు పండ్లు కూడా ఒకటి. ఇవి కేవలం సీజన్‌లో మాత్రమే లభిస్తాయి. అయితే వీటి జ్యూస్ మనకు బయట ఎప్పుడు కావాలంటే అప్పుడు లభిస్తుంది. అయితే కేవలం నేరేడు పండ్లు మాత్రమే కాదు.. నేరేడు ఆకులు కూడా మనకు ఎంతగానో మేలు చేస్తాయి. వీటితో పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. నేరేడు ఆకుల వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నేరేడు ఆకులు 3 లేదా 4 తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి 10 నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి. అనంతరం వచ్చే నీటిని తీసుకుని అందులో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. నేరుగా కూడా ఈ నీటిని తాగవచ్చు. ఈ నీటిని రోజూ ఉదయం పరగడుపునే తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. నేరేడు ఆకుల్లో అనేక రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మనల్ని రోగాల బారి నుంచి రక్షిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
సీజనల్ గా మనకు అనేక వ్యాధులు వస్తుంటాయి. వాటిని తగ్గించుకోవాలంటే రోజూ నేరేడు ఆకుల నీళ్లను తీసుకోవాలి. వీటిల్లో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కనుక వైరస్, బాక్టీరియాల ద్వారా వచ్చే వ్యాధులు తగ్గుతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం వంటివి తగ్గుతాయి. అలాగే ఈ నీళ్లను తాగడం వల్ల శరీరంలోని నొప్పులు, వాపులు తగ్గుతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
నేరేడు ఆకుల నీళ్లను తాగడం వల్ల క్యాన్సర్లు రాకుండా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. ఇలా నేరేడు ఆకులతో అనేక విధాలైన లాభాలను పొందవచ్చు. కనుక ఎక్కడైనా నేరేడు ఆకులు కనిపిస్తే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.