Neem Tree : మనం పూజించే చెట్లల్లో వేప చెట్టు కూడా ఒకటి. అతి పవిత్రమైన, అతి ఉపయోగకరమైన చెట్లల్లో వేప చెట్టు ఒకటి. ఈ చెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుందని మనందరికీ తెలుసు. భారతీయ సాంప్రదాయ వైద్యంలో, ఆయుర్వేదంలో, నాటు వైద్యంలో ఈ చెట్టును విరివిరిగా ఉపయోగిస్తారు. వేప చెట్టు పరిసరాలలో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎవరి ఇంటి ఆవరణలో అయితే వేప చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోని వారు వ్యాధుల బారిన తక్కువగా పడతారు. వేప చెట్టు కింద నిద్రించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందుతామని నిపుణులు చెబుతున్నారు. వేప చెట్టులో ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు దృఢంగా తయారవుతాయి. దంతాలపై పట్టిన గార కూడా తొలగిపోతుంది. నోటి పూత సమస్య రాకుండా ఉంటుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్ల వాపు వంటి సమస్యలు తగ్గుతాయి.
వర్షాకాలం రాగానే ఇంట్లోకి ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వేప ఆకులను మరిగించిన నీటితో ఇంటిని శుభ్రపరచడం వల్ల ఈగలు రాకుండా ఉంటాయి. అదే విధంగా వేప ఆకులను మరిగించిన నీటితో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు తగ్గుతాయి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు వేప ఆకులను నమిలి మింగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే రోగాల బారిన పడకుండా ఉంటాం. ఈ ఆకులను తినడం వల్ల చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఎండిన వేప ఆకులతో ఇంట్లో పొగను వేయడం వల్ల ఇంట్లో ఉండే దోమలు నశిస్తాయి. చుండ్రు సమస్యతో బాధపడే వారు వేప ఆకులను మెత్తగా నూరి తలకు పట్టించి బాగా ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.

రోజూ ఉదయం పరగడుపున నాలుగు గ్లాసుల నీటిలో వేప బెరడును వేసి ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. ఈ నీరు గోరువెచ్చగా అయిన తరువాత ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు, వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. అంతేకాకుండా రక్తం కూడా శుద్ధి అవుతుంది. జిడ్డు చర్మంతో బాధపడే వారు వేప ఆకులను మెత్తగా దంచి ఆ మిశ్రమాన్ని చర్మం పై పూతగా రాసి ఒక గంట తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం పై ఉండే జిడ్డు అంతా తొలగిపోయి మొటిమల సమస్య కూడా తగ్గుతుంది.
చిరుధాన్యాలు, వడ్లు, బియ్యం వంటివి పాడవకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిలో వేపాకులను కలిపి నిల్వ చేసుకోవాలి లేదా వేప కాయలను ఎండబెట్టి పొడిగా చేసి ఆ పొడిని వస్త్రంలో వేసి చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యం, ధాన్యం వంటివాటిలో అక్కడక్కడా ఉంచాలి. ఈ విధంగా వేప చెట్టు ను ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.