Neem Tree: మనకు ప్రకృతి ప్రసాదించిన అనేక ఔషధ గుణాలను కలిగిన చెట్లలో వేప చెట్టు ఒకటి. వేప చెట్టు వల్ల కటిగే ప్రయోజనాలు మనందరికీ తెలుసు. వేప చెట్టును పూజించే ఆచారాన్ని మనం భారతదేశంలో ఎక్కువగా చూడవచ్చు. వేప చెట్టులో ప్రతి భాగం మనకు ఔషధంగా పనికి వస్తుంది. పంటలకు వచ్చే చీడలను, బియ్యం పురుగు పట్టకుండా ఉండడానికి, క్రిమికీటకాలను నశింపజేయడానికి ఇలా అనేక రకాల వాటిల్లో మనం వేప నూనెను, వేప ఆకును, వేప బెరడును, వేపాకు కషాయాలను వాడుతూ ఉంటాం.

తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది రోజు ఉగాది పచ్చడి తయారీలో వేప పూతను మనం ఉపయోగిస్తాం. వేప చెట్టు వల్ల మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుర్వేద వైద్యులు ఎన్నో రకాల వ్యాధుల నివారణలో వేపాకును ఉపయోగిస్తున్నారు. వేపలో ఉండే నింబల్ ప్లేవోయిన్ రసాయనం యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరస్ ఏజెంట్‌గా పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జుట్టులో పేల సమస్యతో బాధపడే వారు వేప నూనెను తలకు రాయడం వల్ల జుట్టులో ఉండే పేలు అన్నీ చనిపోతాయి. వేపలో ఉండే అజాదిరెక్టిన్ అనే రసాయనం పేలు చనిపోయేలా చేస్తుంది.
షుగర్ వ్యాధిని నియంత్రించడంలోనూ వేప ఆకులు ఎంతో ఉపయోగపడుతాయి. వీటిలో ఉండే నింబిడిన్ అనే రసాయనం బీటా కణాల పని తీరుని పెంచి ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. దీంతో షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. వేప ఆకులను నమలడం లేదా కషాయాలు చేసుకుని తాగడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రించబడుతుంది.
క్యాన్సర్ వ్యాధిని తగ్గించడంలో కూడా వేపాకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులో ఉండే నింబిడాల్ అనే రసాయనం క్యాన్సర్ కణాలు వాటంతట అవే చనిపోయేలా చేస్తుందని, దీంతో క్యాన్సర్ వ్యాధి తగ్గే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
వేపాకు నీళ్లను తాగడం వల్ల పొట్టలో ఉండే నులి పురుగులు నశిస్తాయి. వేపాకు రసాన్ని దురదలు ఉన్న చోట రాసుకోవడం వల్ల దురదలు తగ్గుతాయి. నీళ్లల్లో వేపాకును వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేయడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.
సోరియాసిస్ వ్యాధితో బాధపడే వారికి వేప నూనె ఎంతగానో సహాయపడుతుంది. వేపాకును నమలడం వల్ల గొంతులో ఇన్‌ఫెక్షన్లు, గొంతులో పేరుకు పోయిన కఫం, శ్లేష్మం తొలగిపోతాయి. వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవడం దంత సమస్యలు తగ్గుతాయి. నోటి దుర్వాసన తొలగిపోతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.