Regi Akulu : మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మనం బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన కూడా పడుతున్నాం. ఈ వ్యాధులకు సంవత్సరాల కొద్ది మందులు వాడిన ఫలితం లేక ఇబ్బంది పడుతున్న వారు మనలో చాలా మంది ఉన్నారు. ఇటువంటి అనారోగ్య సమస్యలన్నింటిని ఆయుర్వేదం ద్వారా మనం సులభంగా పరిష్కరించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనకు వచ్చే వివిధ రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో రేగి చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రేగి పండ్లు మనకు కాలానుగుణంగా లభిస్తాయి. సంవత్సరానికి ఒకసారి లభించే రేగిపండ్ల గురించే అందరూ ఆలోచిస్తారు కానీ మనకు ఎల్లప్పుడూ లభించే రేగి ఆకుల గురించి ఎవరూ ఆలోచించరు. రేగి చెట్టు ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
రోజూ ఉదయం పరగడుపున పది రేగి ఆకులను శుభ్రంగా కడిగి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ ఆకులను తీసుకోవడం వల్ల అజీర్తి, గ్యాస్, మలబద్దకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు మన దరి చేరవు. జీర్ణశక్తి పెరుగుతుంది. నిద్రలేమితో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు రేగి ఆకులను తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రేగి ఆకులను తినడం వల్ల సత్వర ఉపశమనం కలుగుతుంది. మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా రేగి చెట్టు ఆకులు మనకు ఉపయోగపడతాయి.
రేగి ఆకులను తీసుకుని మెత్తని పేస్ట్ లా చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫ్యాక్ లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సమస్యలు తగ్గి చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనబడుతుంది. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా ఈ ఆకుల్లో ఉండే విటమిన్ సి కూడా చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు పాటించడం వల్ల చక్కటి అందాన్ని సొంతం చేసుకోవచ్చు. రేగి ఆకుల పేస్ట్ ను కురుపుల వంటి వాటిపై రాయడం వల్ల అవి త్వరగా తగ్గుతాయి.
రేగి పండ్లలోనూ, రేగి ఆకుల్లోనూ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆకుల్లో క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. రేగి ఆకులను నీటిలో వేసి మరిగించి కషాయంలా చేసుకోవాలి. ఈ కషాయాన్ని రోజూ తీసుకోవడం వల్ల నీరసం, రక్తహీనత, గొంతునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. రేగి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఈ ఆకులను ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.