Neem Leaves : మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో మనకు ఎంతగానో ఉపయోగపడే వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టులో ఉండే ఔషధ గుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వేప చెట్టులో ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుందని మనకు తెలుసు. వేప చెట్టు నుండి వీచే గాలి కూడా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. వేప చెట్టుకు సర్వ రోగనివారిణి అనే పేరు కూడా ఉంది. వేప చెట్టులో ఉండే సుగుణాలను తెలుసుకున్న మన పెద్దలు దీనిని కూడా మన జీవనంలో ఒక భాగం చేశారు. వేప చెట్టును ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేప చెట్టు ఆకులు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగస్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా వేప ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అనేక రకాల రోగాలను నయం చేయడంలో ఎక్కువగా వేప ఆకులను ఉపయోగిస్తారు. మన శరీరంలో ఉండే మలినాలను బయటకు పంపించడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలో వాతం ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే నొప్పులను తగ్గించడంలో కూడా వేప ఆకులు మనకు ఉపయోగపడతాయి.
ప్రతిరోజూ ఉదయం పరగడుపున రెండు వేప ఆకులను తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. ఇలా వేప చెట్టు ఆకులను తినడం వల్ల లేదా వేప ఆకులతో కషాయాన్ని చేసుకొని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ ఇన్ ఫెక్షన్ ల బారిన పడే వారు వేప ఆకులను తినడం వల్ల లేదా ఆకుల కషాయాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే విష జ్వరాల బారిన పడకుండా ఉంటాం. వేప ఆకుల పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి అంతే మోతాదులో తేనెను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు పోతాయి.
ఒక టీ స్పూన్ వేప ఆకుల పొడిని ఒక గ్లాస్ నీటిలో కలుపుకుని భోజనానికి ముందు రెండు పూటలా తాగాలి. ఇలా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వేప ఆకులను ఏ రూపంలో తీసుకున్నా కూడా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. గ్యాస్, అజీర్తి, కడుపులో మంట, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వేప ఆకులను తీసుకోవడం వల్ల ప్రేగుల్లో ఉండే మలినాలు తొలగిపోయి ప్రేగులు శుభ్రపడతాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి కూడా వేప ఆకులు సహాయపడతాయి.
వేప ఆకులను తీసుకుని మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని నొప్పులు ఉన్న చోట ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. నోటి సంబంధిత సమస్యలతో బాధపడే వారు గోరు వెచ్చని వేపాకుల కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల నోట్లో, లాలాజలంలో ఉండే బాక్టీరియా నశించి నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది. కళ్ల కలక, కంట్లో దురదలు, కళ్ల మంట వంటి సమస్యలతో బాధపడే వారు వేపాకుల కషాయంతో కళ్లను కడుక్కోవడం వల్ల సమస్యలు దూరమవుతాయి.
మనకు వచ్చే చర్మ వ్యాధులన్నింటినీ నయం చేయడంలో వేప ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. నీటిలో వేప ఆకులను వేసి వేడి చేసి ఆ నీటితో స్నానం చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే వేప ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవడం వల్ల చుండ్రు, తలలో దురదలు వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ వేపాకుల పేస్ట్ ను గాయాలు, పుండ్లు వంటి వాటిపై రాసుకోవడం వల్ల అవి త్వరగా మానుతాయి. ఈ విధంగా వేపాకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.