Banana Tree : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో అరటి పండు కూడా ఒకటి. అరటి పండు మనకు అన్ని కాలాల్లో విరివిరిగా లభిస్తుంది. చాలా మంది అరటి పండును ఎంతో ఇష్టంగా తింటారు. అరటి పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికి తెలిసిందే. కానీ అరటిపండుతో పాటు అరటి చెట్టు కూడా మేలు చేస్తుందని మనలో చాలా మందికి తెలియదు. అరటి చెట్టు ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అరటిని సంస్కృతంలో కదళీ, హిందీలో ఖేలా అని పిలుస్తారు. అరటిలో అనేక రకాలు ఉన్నాయి. అరటి చెట్టు రసం తీపి, వగరు రుచులను కలిగి ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లను, సెగ రోగాలను, రక్తపైత్యాన్ని పోగొట్టడంలో అరటి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
అరటి చెట్టులో ఉండే ఔషధ గుణాలను అలాగే దీనిలో ఏయే ఏయే భాగం ఏయే ఏయే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పువ్వులు దగ్గు, ఆయాసం వంటి మొదలైన శ్వాస రోగాలను పోగొట్టి బలాన్ని కలిగిస్తుంది. అరటి ఆకులో భోజనం చేయడం వల్ల మనసుకు ఇంపుగా ఉంటుంది. అంతేకాకుండా అరటి ఆకులో భోజనం చేయడం వల్ల జ్వరం, కఫ వాతం, దగ్గు, ఉబ్బసం వంటి అనారోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి. నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడే స్త్రీలు బాగా మగ్గిన అరటి పండును 50 గ్రాములు నాటు ఆవు లేదా నాటు గేదె నెయ్యితో కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల అధిక రక్తస్రావం సమస్య నుండి బయటపడవచ్చు. ఉసిరికాయ రసంలో అరటి పండును, తేనెను, పటిక బెల్లాన్ని కలిపి రెండు పూటలా తీసుకోవాలి.
ఇలా తీసుకోవడం వల్ల స్త్రీలల్లో వచ్చే సోమ రోగం హరించుకుపోతుంది. కాలిన గాయాలపై వెంటనే బాగా పండిన అరటిపండును నలిపి ఉంచాలి. ఇలా చేయడం వల్ల మంట, పోటు తగ్గడంతో పాటు గాయాలు కూడా త్వరగా మానిపోతాయి. అలాగే బాగా మెత్తగా ఉన్న పసుపు పచ్చని చిన్న అరటి పండును తింటూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది. తెల్లబొల్లి మచ్చలతో బాధపడే వారు అరటి చెట్టు దూటరసంలో పసుపు కలిపి మచ్చలపై రాస్తూ ఉంటే తెల్లబొల్లి త్వరగా తగ్గుతుంది. మూడు చెంచాల అరటి చెట్టు వేరు రసాన్ని ఒక కప్పు నీటిలో కలిపి తాగుతూ ఉంటే అతి వేడి, అతి పైత్యం సమస్య రెండు నుండి మూడు రోజుల్లో తగ్గుతుంది. ఎండిన అరటి చెట్టును కాల్చగా వచ్చిన బూడిదను నిల్వ చేసుకోవాలి. ఈ బూడిదను ఒకటి లేదా రెండు గ్రాముల మోతాదుగా ఒక కప్పు నీటిలో కలిపి తాగడం వల్ల అన్ని రకాల కడుపు నొప్పులు తగ్గుతాయి.
అరటిదుంపను దంచి పొత్తి కడుపుపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల అతి త్వరగా సహజంగా ఆగిన మూత్రం బయటకు వస్తుంది. రోజూ ఉదయం పరగడుపున ఒక చక్కెరకేళీ అరటిపండును తగినంత గోమూత్రంతో కలిపి మెత్తగా నలిపి ఆ మిశ్రమాన్ని సేవిస్తూ ఉంటే అతి దారుణమైన ఉబ్బసం త్వరగా తగ్గుతుంది. అలాగే కొందరు స్త్రీలల్లో వివిధ కారణాల చేత యోని బయటకు జారిపోతుంది. దీనినే యోనికంద రోగం అని అంటారు. అలాంటి వారు పచ్చి అరటికాయను ముక్కలుగా తరిగి ఎండబెట్టాలి. తరువాత వీటిని పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పూటకు 5 గ్రాముల మోతాదులో రెండు పూటలా సేవిస్తూ ఉంటే యోనికంద రోగం హరించుకుపోతుంది. అరటిదుంప రసాన్ని 20 గ్రాములు, పటిక బెల్లం 20 గ్రాములు కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే తెల్లశెగ, పచ్చ శెగ, ఎర్రశెగ తగ్గిపోతాయి.
అరటి ఊచ రసాన్ని అర కప్పు మోతాదులో పరగడుపున సేవిస్తూ ఉంటే స్త్రీలల్లో ఆగిన బహిష్టు మరలా వస్తుంది. అరటిఆకులను బాగా ఎండబెట్టి కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిదను జల్లించి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బూడిదను రెండు చిటికెల మోతాదులో ఒక టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకుంటే పులిత్రేన్పులు తగ్గుతాయి. మెత్తటి అరటిపండును, వేడి అన్నాన్ని, గేదె పేడను కలిపి పుండ్లపై ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల ఎంత పెద్ద పుండ్లైనా తగ్గిపోతాయి. అరటి పండును తీసుకుని దానికి చిటికెన వేలుతో రంధ్రం చేయాలి. తరువాత అందులో ఒక గ్రాము మిరియాల పొడి వేసి ఆ పండును రెండు పూటలా తినాలి. ఇలా చేయడం వల్ల చాలాకాలం నుండి వేధించే దగ్గు తగ్గుతుంది. ఈ విధంగా అరటి చెట్టులో ప్రతి భాగం మనకు ఎంతో ఉయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.