Jammi Chettu : ప్రకృతిలో అనేక రకాల చెట్లు ఉంటాయి. ఈ భూమి మీద ఉండే చెట్లు మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి. అలాగే కొన్ని రకాల చెట్లకు మనం పూజలు కూడా చేస్తూ ఉంటాం. మనం పూజించే చెట్లల్లో జమ్మి చెట్టు కూడా ఒకటి. దేవతా వృక్షాలలో జమ్మి చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మన పురాణాలలో కూడా జమ్మి చెట్టు గురించి ప్రస్తావన ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఎంతో విశిష్టత కలిగిన జమ్మిచెట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జమ్మి చెట్టు పాపాలను పోగొడతుందని, శత్రువులను కూడా నాశనం చేస్తుందని పండితులు చెబుతున్నారు. శ్రీరాముడు రావణాసురుడిపై యుద్దానికి వెళ్లే ముందు జమ్మి చెట్టుకు పూజ చేసి వెళ్లి విజయం సాధించాడట.
అలాగే అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు పాండవులు వారి ఆయుధాలను జమ్మి చెట్టు మీద ఉంచి, మేము వచ్చే వరకు ఆయుధాలను కాపాడమని ఆ చెట్టుకు మొక్కి వెళ్తారు. అజ్ఞాతవాసం ముగిసిన తరువాత విజయదశమి రోజున చెట్టు మీది నుండి ఆయుధాలను తీసుకుని కౌరవులపై యుద్ధం చేసి విజయం సాధిస్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు విజయదశమి రోజున జమ్మి చెట్టుకు మనం పూజలు చేస్తూనే ఉన్నాం. జమ్మి చెట్టుకు పూజలు చేయడం వల్ల అన్ని పనుల్లో మనకు విజయం చేకూరుతుందని మనలో చాలా మంది విశ్వసిస్తారు. విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేసి ఆ చెట్టు ఆకులను పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటారు.
వినాయక చవితి రోజు చేసే పత్రి పూజలో కూడా జమ్మిచెట్టు ఆకులను ఉంచుతారు. జమ్మి చెట్టును హోమద్రవ్యంగా కూడా ఉపయోగిస్తారు. జమ్మిచెట్టు మనకు విజయాలనే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఆయుర్వేదంలో జమ్మి చెట్టును అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. జమ్మిచెట్టు ప్రతిభాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. జమ్మిచెట్టు నుండి వీచే గాలి ఎంతో శ్రేష్టమైనది. ఈ చెట్టు గాలిని పీల్చడం వల్ల ఎన్నో రోగాలు నయం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
జమ్మి ఆకుల పసరును లేపనంగా రాయడం వల్ల కుష్టు వ్యాధి నయం అవుతుంది. జమ్మి ఆకులను, జమ్మి చెట్టు బెరడును, మిరియాలను కలిపి మెత్తగా నూరి మాత్రలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రలను మజ్జిగతో కలిపి తీసుకోవడం వల్ల అతిసారం తగ్గుతుంది. జమ్మి ఆకుల పసరును రాసుకోవడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. ఈ చెట్టు బెరడును నూరగా వచ్చిన గంధాన్ని విషకీటకాలు కుట్టిన చోట రాయడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది.
ఎండిన జమ్మి ఆకులను కాల్చగా వచ్చే పొగను కళ్లకు చూపించడం వల్ల కళ్ల సమస్యలు తగ్గుతాయి. అన్ని కాలాలలో పచ్చగా ఉండే జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ భూమిలో నీరు పుష్కలంగా ఉంటుంది. ఎండిన జమ్మి ఆకులను భూమిలో వేసి దున్నడం వల్ల భూమి సారవంతమవుతుంది. ఈ విధంగా జమ్మి చెట్టు మనకు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.