త్వరలో కూలిపోయే అవకాశం మెండుగా ఉన్న ఇంటిని ఓ అమెరికా వ్యక్తి దాదాపు మూడు కోట్లకు కొన్న ఉదంతం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది. కస్టమర్ల ధోరణిలో మార్పులకు ఈ ఉదంతం అద్దం పడుతోందని అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. మాసాచుసెట్స్ రాష్ట్రంలోని ఈస్థమ్ సముద్ర తీరంలో ఈ మూడు పడకగదుల ఇల్లు. తీరంలో 25 అడుగుల ఎత్తున ఇసుక తిన్నెలపై ఈ ఇంటిని నిర్మించారు. 2022లో ఈ ఇంటిని అమ్మకానికి పెట్టారు. అప్పట్లో దీని ధర 1.195 మిలియన్ డాలర్లు పలికింది. అయితే, తీరం కోతకు గురవుతుండటంతో ఇది మరో పదేళ్లకు మించి నిలిచుండదని తేలడంతో డిమాండ్ పడిపోయింది.
చివరకు డేవిడ్ మూట్ (59) అనే ఇంటీరియర్ డిజైనర్ దీన్ని 67 శాతం తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. చూద్దాం.. మున్ముందు ఏం జరగనుందో. ఇది ఏదో రోజు సముద్రంలో కూలిపోతుంది. అయితే, నా జీవితకాలంలో అది జరగకపోవచ్చు అంటూ డేవిడ్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఇటీవల కాలంలో అనేక మంది ఇలాగే ఆలోచిస్తున్నారని అక్కడి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెబుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా కనుమరుగయ్యే రియల్ ఎస్టేట్ ఆస్తులను తక్కువ ధరల్లో సొంతం చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలిపారు.
కాగా, అగ్రిమెంట్ కుదుర్చుకునే ముందు డేవిడ్ నిపుణులను సంప్రదించారు. ప్రమాదావకాశాలను తగ్గించుకునేందుకు పలు చర్యలు చేపట్టేందుకు సిద్ధమై ఇంటిని కొనుగోలు చేశారు. ముఖ్యంగా ఇంటి కింద మట్టి కొట్టుకుపోకుండా ఉండేందుకు అక్కడ మొక్కలను పెంచడం, ఇంటిలో కొంత భాగాన్ని సముద్రానికి మరింత దూరంగా జరపడం వంటి చర్యలు చేపడుతున్నారు. నిపుణుల ప్రకారం, అక్కడ తీరం కోతకు గురవడంతో పాటు సముద్రం మట్టం కూడా పెరిగి తీర ప్రాంతం ముంపునకు గురవుతుందట.
అయితే, ఇలాంటి ఆస్తుల కొనుగోళ్లు చేయొద్దని ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీఫెన్ లెదర్‌మన్ అన్నారు. తీరంలో ఉన్న ఆస్తులతో పలు ప్రమాదాలు ఉన్నాయని, ముఖ్యంగా తుఫాన్ల సందర్భంగా ప్రమాదాలకు ఛాన్స్ పెరుగుతుందని హెచ్చరించారు. అయితే, తన లాగా జీవిత చరమాంకంలో ఉన్న వారికి ఈ ఇంట్లో ఉండి ప్రకృతి అందాలను తిలకించే అవకాశం కల్పించాలన్నదే తన ఉద్దేశమని డేవిడ్ మూట్ తెలిపారు.