కుంకుమ పువ్వు.. మన దేశంలో కాశ్మీర్‌లో ఎక్కువగా ఇది ఉత్పత్తి అవుతుంది. కుంకుమ పువ్వుకు చెందిన మొక్క పువ్వులో ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వును తయారు చేస్తారు. దీంతో దీని ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇది చేసే అద్భుతాలు అమోఘం. మన దగ్గర ఎక్కువగా దీన్ని వంటల్లో వాడుతారు. దీంతో ఆయా వంటకాలకు మంచి రుచి వస్తుంది. అలాగే పలు సౌందర్య సాధన ఉత్పత్తుల్లోనూ దీని వాడుతారు. ఈ క్రమంలో కుంకుమ పువ్వు వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ ఉదయాన్నే కుంకుమ పువ్వును చిటికెడు తీసుకుని దాన్ని ఒక టీస్పూన్ తేనెలో కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల మగవారిలో ధాతుపుష్టి పెరుగుతుంది. వీర్య వృద్ధి జరుగుతుంది. శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
కుంకుమ పువ్వు కొద్దిగా తీసుకుని దాన్ని గంధంలా అరగదీసి ముఖానికి రాయాలి. కొంత సేపు అయ్యాక కడిగేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. రాత్రి పూట భోజనంతోపాటు కుంకుమ పువ్వును తీసుకుంటే దాంతో చక్కగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధ పడేవారికి ఇది మంచి ఔషధం. గర్భిణీలు కుంకుమ పువ్వు కలిపిన పాలను రోజూ తాగితే పుట్టబోయే బిడ్డ తెల్లగా ఉంటాడని పెద్దలు చెబుతారు. అయితే ఇందులో నిజం ఉన్నా లేకపోయినా కుంకుమ పువ్వు మాత్రం కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుందట. కనుక బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం కోసమైనా గర్భిణీలు దీన్ని తాగాల్సిందే. ఒకప్పుడు రోమన్లు దిండు కింద కుంకుమ పువ్వును పెట్టి నిద్రించే వారట. అలా చేస్తే గాఢమైన నిద్ర పడుతుందని వారు నమ్మేవారు.
కుంకుమ పువ్వును నిత్యం తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం. అజీర్ణం వంటివి తగ్గుతాయి. కుంకుమ పువ్వును నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటే తద్వారా నేత్ర సమస్యలు పోతాయి. దృష్టి మెరుగవుతుంది. పాలు లేదా టీలో రోజూ కుంకుమ పువ్వును కలుపుకుని తాగితే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఇది ఎదిగే పిల్లలకు చాలా మంచిది. గుండె సమస్యలు రాకుండా చేసే ఔషధ గుణాలు కుంకుమ పువ్వులో ఉన్నాయి. దీన్ని వాడడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. ఆస్తమా ఉన్నవారు కుంకుమ పువ్వుతో తయారు చేసే టీ ని తాగితే ఫలితం ఉంటుంది. కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల స్త్రీలలో రుతు సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.
డిప్రెషన్‌తో బాధపడుతున్న వారికి కుంకుమ పువ్వును పాలలో కలిపి ఇస్తే ఫలితం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అన్ని ఆహార పదార్థాలను కల్తీ చేసినట్టుగానే కుంకుమ పువ్వును కూడా కల్తీ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో నకిలీ కుంకుమ పువ్వు విరివిగా లభిస్తోంది. అయితే మీరు కొన్న కుంకుమ పువ్వు మంచిదా కాదా అన్నది చూడాలంటే ఓ రేకుని కాసిని గోరువెచ్చని నీళ్లు లేదా పాలల్లో వేయాలి. అవి వెంటనే రంగు మారితే అది కచ్చితంగా నకిలీదే. స్వచ్ఛమైన కుంకుమపవ్వు కనీసం 15 నిమిషాలు నానిన తరువాతగానీ అందులోనుంచి రంగు దిగదు. అప్పుడే వాసన కూడా మొదలవుతుంది. పొడిరూపంలో కుంకుమ పువ్వుని అస్సలు కొనకూడదు. ఇందులో మోసం మరింత ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.