Hair Pack : మనం అందంగా కనిపించడంలో జుట్టు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ నేటి తరుణంలో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం, జుట్టు నిర్జీవంగా మారడం, జుట్టు చివర చిట్లడం, చుండ్రు వంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, రసాయనాలు కలిగిన షాంపులను, కండిషనర్స్ ను వాడడం, సరైన జీవన విధానాన్ని పాటించకపోవడం వంటి అనేక కారణాల వల్ల జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి.
ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడడం, వాటికి సంబంధించిన చికిత్సలను తీసుకోవడం వల్ల అలాగే కొందరిలో జన్యుపరంగా కూడా జుట్టు రాలడం జరుగుతుంది. సహజ సిద్ద పదార్థాలతో ఇంట్లో తయారు చేసుకున్న హెయిర్ ప్యాక్ ను వాడడం వల్ల మనం జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ హెయిర్ ప్యాక్ జుట్టుకు కండిషనర్ గా కూడా పని చేస్తుంది. జుట్టును అందంగా మార్చే హెయిర్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే ఈ హెయిర్ ప్యాక్ ను ఎలా వాడాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకోవడానికి మనం గోరింటాకు పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది. దీనినే హెన్నా పౌడర్ అని కూడా అంటారు. దీనితో పాటు ఆలివ్ నూనెను, పెరుగును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో పెరుగు, ఆలివ్ నూనెను తీసుకోవాలి. తరువాత అందులో గోరింటాకు పొడి వేసి కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని ఉపయోగించే ముందు చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. వీటిని వేసుకోవడం వల్ల చేతులు ఎర్రగా అవ్వకుండా ఉంటాయి. తరువాత ఈ పేస్ట్ ను జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు రాసి మర్దనా చేయాలి.
తరువాత జుట్టును ముడి వేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. గంట తరువాత గోరు వెచ్చని తలస్నానం చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ జుట్టును నల్లగా మార్చదు. కానీ ఇతర జుట్టు సంబంధిత సమస్యలన్నింటిని తగ్గిస్తుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు కాంతివంతంగా తయారవుతుంది. చుండ్రు సమస్య కూడా నివారించబడుతుంది. ఈ హెయిర్ ప్యాక్ ను వారినికి ఒకసారి వేసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.