నిద్రించే సమయంలో కలలు రావడం సహజం. ప్రతి మనిషికి ఆ టైంలో ఏదో ఒక కల వస్తుంది. వాటిలో కొన్ని మామూలుగా ఉంటే కొన్ని కలలు భయపెట్టేవిగా ఉంటాయి. సాధారణంగా మనకు కలలు అసలు గుర్తుండవు. కొన్ని కలలు కొద్ది నిమిషాల పాటో, కొన్ని గంటల పాటో, కొన్ని రోజుల పాటో ఉంటాయి. ఆ తరువాత వాటిని మనం మరిచిపోతాం. కానీ కొన్ని భయంకరమైన పీడకలలు మాత్రం అసలు మరిచిపోదామన్నా ఓ పట్టాన పోలేము. అంతగా అవి మనల్ని భయపెడతాయి. అయితే అలాంటి పీడ కలలు, చెడు కలలు రావడం వెనుక కొన్ని కారణాలు ఉంటాయట. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చెడు కలలు తెల్లవారుజామున 3 గంటలకు వస్తాయట. కొంత మందికి కలలో దెయ్యాలు, భూతాలు, పాములు తదితర భయంకరమైనవి కనిపిస్తాయట. ఇంకొందరికి తాము ఎక్కడో పడిపోతున్నట్టు, ఎవరో తమను హత్య చేస్తున్నట్టు, లేదంటే వారే ఎవరినో హత్య చేస్తున్నట్టు, గొడవలు పడినట్టు కలలు వస్తుంటాయట. అయితే ఇలా చెడు కలలు వచ్చే వారు ఎక్కువగా సృజనాత్మక శక్తిని కలిగి ఉంటారట. పలు అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఏదైనా ఎత్తయిన ప్రదేశం నుంచి కింద పడినట్టు లేదా కాళ్లను ఎవరో బలవంతంగా లాగుతున్నట్టు కలలు వస్తే వారు స్వేచ్ఛగా జీవించలేకపోతుండడాన్ని ఆ కలలు సూచిస్తాయి. ఆ వ్యక్తుల శక్తి సామర్థ్యాలు కూడా నశించాయని ఆ కలలు తెలియజేస్తాయి. వారు జీవితంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారని, దాన్నిపరిష్కరించుకోలేకపోతున్నారనే విషయాన్ని అలాంటి కలలు సూచిస్తాయి.
యాక్సిడెంట్‌కి గురైనట్టు, గాయ పడినట్టు కలలు వస్తే ఆ వ్యక్తుల పర్సనల్ లైఫ్ అత్యంత బలహీనంగా ఉందని తెలుసుకోవాలి. ఇలాంటి కలలు అలాంటి వ్యక్తులకు తమ ఆత్మగౌరవాన్ని పెంచుకోవాలని సూచిస్తాయి. ఎట్టి పరిస్థితిలో ఉన్న, ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని ఆ కలలు తెలుపుతాయి. అనుకోని ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నట్టు, వాటిలో ఇరుక్కుపోయినట్టు, తప్పించుకోవడానికి చూస్తున్నట్టు కలలు వస్తుంటే అవి త్వరలో జరగబోయే ఏదైనా కార్యక్రమానికి సంబంధించి సదరు వ్యక్తుల్లో ఉన్న భయాన్ని సూచిస్తాయి. నిత్యం ఒత్తిడికి గురవుతున్న వారికి కూడా ఇలాంటి కలలు వస్తాయి. పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు పరీక్షలు మిస్ అయినట్టు, ఫెయిల్ అయినట్టు కలలు వస్తుంటాయి. ఇవి వారిలోని భయం, ఆందోళనలను సూచిస్తాయి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వారు సదరు విద్యార్థులపై పెట్టుకున్న నమ్మకం కారణంగా వారు ఒత్తిడికి గురవుతుండడాన్ని సూచిస్తాయి. నెగెటివ్ ఆలోచనలు ఉన్నవారికి కూడా ఇలాంటి కలలు వస్తుంటాయి.
చనిపోయిన వారు కలలో కనిపిస్తే వారి మరణాన్ని ఆ వ్యక్తులు తట్టుకోలేకపోతున్నారని అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తులు చనిపోయినట్టే కలలు వస్తే అది వారి పాజిటివ్ డెవలప్‌మెంట్‌ను సూచిస్తుంది. ఆయుధాలు పట్టుకుని వెంటాడుతున్నట్టు, జంతువులు వెంబడిస్తున్నట్టు, ఎవరో ఎటాక్ చేస్తున్నట్టు కలలు వస్తే అవి జీవితంలో ఏదో సమస్యను పరిష్కరించడానికి కష్టపడుతున్నారనే విషయాన్ని తెలియజేస్తాయి. ఒక్కోసారి మన జీవిత భాగస్వామి మనకు దూరంగా వెళ్లిపోయినట్టు, లేదంటో ఎవరో వారిని కిడ్నాప్ చేసినట్టు కలలు వస్తాయి. ఇది మనలో ఉన్న త్యాగశీలతను తెలియజేస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా లేకపోయినా, ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ కలుగుతున్నా ఈ కలలు వస్తాయట. ఎవరో మనల్ని పకడ్బందీగా పట్టుకున్నట్టు, వారు మనల్ని ఉచ్చులోకి దించినట్టు కలలు వస్తే మనం కష్టాల్లో ఉన్నామని అర్థం. ఇష్టం లేని పనిచేసినా ఇలాంటి కలలు వస్తాయట. సంబంధ బాంధవ్యాలు, పని ఒత్తిడి వంటి కారణాల వల్ల ఇలాంటి కలలు వస్తాయట.
మనకు మనమే కలలో నగ్నంగా కనపడితే మన ఆత్మగౌరవం తగ్గిపోయినట్టు, దాని గురించే మనం కలత చెందుతున్నట్టు అర్థం చేసుకోవాలి. లోలోపల ఎక్కువగా భయం ఉన్న వారికి ఇలాంటి కలలు వస్తాయి. చాలా మంది తమకు కలలో పాములు కనపడితే బాగా భయపడిపోతారు. నెగెటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉన్నవారిని తమను తాము రక్షించుకోవాలని సూచిస్తూ ఇలాంటి కలలు వస్తాయట. సమస్యలను పరిష్కరించుకోబోతున్న వారికి కూడా ఇలాంటి కలలే వస్తాయట.