Saggubiyyam Vadalu : మనం అప్పుడప్పుడు పాయసాన్ని తయారు చేస్తూ ఉంటాం. ఈ పాయసం తయారీలో సగ్గు బియ్యాన్ని కూడా వాడుతూ ఉంటాం. కొందరు నేరుగా సగ్గు బియ్యంతోనే పాయసాన్ని తయారు చేస్తూ ఉంటారు. సగ్గుబియ్యంతో చేసే పాయసం చాలా రుచిగా ఉంటుంది. అదే విధంగా సగ్గుబియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
ఎముకలను దృఢంగా ఉంచడంలో, బీపీని నియంత్రించడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సగ్గుబియ్యం ఉపయోగపడుతాయి. తరచూ సగ్గుబియ్యాన్ని తీసుకోవడం వల్ల బరువు తక్కువగా ఉన్న వారు బరువు పెరుగుతారు. వీటితో పాయసాన్నే కాకుండా ఎంతో రుచిగా ఉండే వడలను కూడా తయారు చేసుకోవచ్చు. సగ్గుబియ్యం వడలు చాలా రుచిగా ఉండడమే కాకుండా, చాలా సులువుగా కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. సగ్గుబియ్యం వడల తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. వీటిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గు బియ్యం వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టుకున్న సగ్గు బియ్యం – ఒక కప్పు, పచ్చి మిర్చి – 5, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, బియ్యం పిండి – ఒక టీ స్పూన్, వేయించి పొట్టు తీసిన పల్లీలు – పావు కప్పు, ఉడికించిన బంగాళాదుంప – 1, కరివేపాకు – రెండు రెబ్బలు, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
సగ్గు బియ్యం వడల తయారీ విధానం..
ఒక జార్ లో పల్లీలను, పచ్చి మిర్చిని, జీలకర్ర ను వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని, ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని, ఉప్పును, బియ్యం పిండిని, ఉడికించిన బంగాళాదుంపను, కరివేపాకును వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో నీటిని పోయకూడదు. సగ్గుబియ్యంలో ఉన్న తడితోనే ఈ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత కావల్సిన పరిమాణంలో పిండిని తీసుకుని వడల్లా చేసుకుని నూనెలో వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సగ్గు బియ్యం వడలు తయారవుతాయి. వీటిని నేరుగా లేదా పల్లీ చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. తరచూ సగ్గుబియ్యంతో పాయసాన్ని చేయడానికి బదులుగా అప్పుడప్పుడూ ఇలా వడలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.