Sanna Karapoosa : మనకు స్వీట్ షాపుల్లో లభించే చిరుతిళ్లల్లో సన్నకారపూస ఒకటి. సన్నగా, రుచిగా, కరకరలాడుతూ ఉండే కారపూసను చాలా మంది ఇష్టంగా తింటారు. స్వీట్ షాపుల్లో లభించే విధంగా రుచిగా ఉండే ఈ సన్నకారపూసను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కారపూసను తయారు చేయడం చాలా తేలిక. స్వీట్ షాష్ స్టైల్ లో రుచిగా సన్నకారపూసను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సన్న కారపూస తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, ఉప్పు – తగినంత, కారం – ముప్పావు టీ స్పూన్ లేదా తగినంత, పసుపు – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
సన్న కారపూస తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, ఉప్పు, కారం, బియ్యం పిండి. పసుపు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టంలో చిన్న రంధ్రాలు ఉన్న బిళ్లను ఉంచి దానికి నూనెను రాయాలి. తరువాత అందులో తగినంత పిండిని ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో కారపూసను వత్తుకోవాలి. దీనిని మధ్యస్థ మంటపై రెండు వైపులా రంగు మారే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా కారపూసను వత్తుకున్న తరువాత అదే నూనెలో కరివేపాకును వేసి వేయించి కారపూసపై వత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సన్న కారపూస తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఈ సన్నకారపూసను పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. బయట లభించే చిరుతిళ్లను తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే కారపూసను తయారు చేసుకుని తినవచ్చు.