ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల వాడకం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. అత్యంత తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్లు లభిస్తుండడంతో వీటిని కొనే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ క్రమంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్ కచ్చితంగా కనబడుతోంది. అయితే అక్కడి వరకు బాగానే ఉన్నా చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఇప్పుడు ఎదురవుతున్న అసలు సమస్య ఫోన్ హ్యాంగ్ అవడం. ఏదైనా అత్యంత అవసరం ఉన్న సమయంలో ఫోన్ కావాలంటే ఒక్కోసారి డివైస్ సరిగ్గా పనిచేయదు. ఈ క్రమంలో ఫోన్ హ్యాంగ్ అయి, ఆగిపోతుంటుంది. బటన్లు ఏం ప్రెస్ చేసినా సరిగ్గా పనిచేయవు. అయితే ఇలాంటి సమస్యలను కింద ఇచ్చిన టిప్స్‌తో సులభంగా అధిగమించవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాంగ్ కావడానికి ప్రధాన కారణం డివైస్ బ్యాక్ గ్రౌండ్‌లో అప్లికేషన్స్ రన్ అవడమే. అయితే వీటిని సింపుల్‌గా రిమూవ్ చేయవచ్చు. అదెలాగంటే నావిగేషన్ కీని ప్రెస్ చేస్తే ఓ లిస్ట్ వస్తుంది. అందులో ఉన్న యాప్స్ అన్నింటినీ క్లోజ్ చేస్తే చాలు, బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతాయి. దీంతో డివైస్ స్పీడ్ అవుతుంది. హ్యాంగింగ్ ప్రాబ్లం తప్పుతుంది.
ఆండ్రాయిడ్ డివైస్‌లో సెట్టింగ్స్– ప్రైవసీ సెట్టింగ్స్ లోకి వెళ్లి క్లియర్ క్యాచె అనే ఆప్షన్‌ను ఎంచుకుని ఓకే చేస్తే చాలు. డివైస్‌లో ఉన్న టెంపరరీ ఫైల్స్, కుకీస్, హిస్టరీ అంతా క్లీన్ అయి డివైస్ హ్యాంగ్ కాకుండా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఏదైనా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే కేవలం గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మాత్రమే ఇన్‌స్టాల్ చేయాలి. ఇతర సైట్లలోని ఆండ్రాయిడ్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయకూడదు. లేదంటే వాటి వల్ల డివైస్ సాఫ్ట్‌వేర్‌కు ప్రాబ్లం వచ్చి డివైస్ హ్యాంగ్ అయిపోతుంటుంది. కొన్ని సార్లు ఫోన్లలో పలు యాప్స్ మనకు అవసరం లేకున్నా వాటంతట అవే ఇన్‌స్టాల్ అయిపోతుంటాయి. దీని వల్ల కూడా డివైస్ హ్యాంగ్ అవుతుంది. దీన్ని నివారించాలంటే యాంటీ వైరస్ లేదా క్లీనింగ్ యాప్స్ వేసుకుని ఇష్టం లేని యాప్స్‌ను తీసేస్తే సరి.
ఫోన్‌లో ఇంటర్నల్ మెమోరీ మరీ తక్కువగా ఉన్నా డివైస్ పనిచేయదు. ఈ సందర్భంలో కొన్ని ఫైల్స్‌ను ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ఎస్‌డీ కార్డ్‌కు మూవ్ చేయాలి. దీంతో డివైస్ మెమోరీ ఫ్రీ అయి బాగా పనిచేస్తుంది. ఫోన్‌ను వారానికి ఒకసారి రీస్టార్ట్ చేసినా, లేదంటే పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినా డివైస్ బాగానే పనిచేస్తుంది. అయితే అలా కాకపోతే మెమోరీ కార్డ్, బ్యాటరీలను తీసి ఒకసారి ఫోన్‌ను ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయాలి. సాధారణంగా చాలా మంది తమ ఫోన్‌కు వచ్చిన చార్జర్ కాకుండా ఏవేవో చార్జర్లను వాడుతుంటారు. అయితే అలా వాడకూడదు. కేవలం కంపెనీ ఇచ్చిన చార్జర్‌లనే చార్జింగ్ కోసం వాడాలి. లేదంటే డివైస్ సరిగ్గా పని చేయదు. ఫోన్‌లో మీరు వాడే యాప్స్‌ను మాత్రమే ఉంచుకోండి. అవసరం లేని యాప్స్‌ను తీసేయండి. దీంతో డివైస్ మెమోరీ పెరిగి స్పీడ్‌గా పనిచేస్తుంది.