వినోదం

మహేష్ బాబు రాణించినంతగా సినిమాలలో ఆయ‌న అన్న రమేష్ బాబు రాణించక పోవడానికి కారణం ఏమిటి?

సాఫ్ట్వేర్ మేనేజర్ గా పనిచేసిన ఓ వ్యక్తి ఉద్యోగానికి రిజైన్ చేసి ఒక చిన్న రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. అప్పటిదాకా అతను ఎప్పుడు ఏమంటాడో, ఏ ప్రాజెక్ట్ అంటగడతాడో, ఎవరిని పీకేస్తాడో అని బెదురుతూ ఉన్న అతని టీమ్, అతని రెస్టారెంట్లో అతనితో ఫ్రీ గా మాట్లాడుతూ – ఏ ఐటమ్ బాలేదో నిస్సంకోచంగా చెప్పటం గమనించాను. బయటకు వస్తూ – మంచి జాబ్ వదులుకున్నాడు అనటమూ. నాకు మాత్రం ఆ వ్యక్తి ముఖంలో సంతోషం కనబడింది. సాఫ్ట్వేర్ మేనేజర్ గా ఉన్నప్పుడు ఎప్పుడూ అంత ఉల్లాసంగా కనిపించలేదు. ఒకరికి విజయంగా కనబడింది, మరొకరికి విజయం కాకపోవచ్చు. రాష్ట్రపతి మెడల్ కన్నా కన్నతండ్రి కళ్ళల్లో కనబడే మెరుపు ఎక్కువ సంతోషాన్ని ఇవ్వవచ్చు. కొందరికి మొదటిదే విజయంగా కనబడవచ్చు.

కొందరి గమ్యం వేరే ఉంటుందని అర్ధం కావటానికి, మెజారిటీ జనం ముఖ్యం అనుకునేవాటి పట్ల వారికి ఎటువంటి ఆసక్తి ఉండదనే మాట ప్రాసెస్ అవటానికి సమయం పడుతుంది. రమేష్ బాబు అందగాడు. వివాదరహితుడు. తండ్రిలాగా సంస్కారం ఉన్నవాడు. మొదటి సినిమా – సామ్రాట్ తో హిట్ కొట్టినవాడు. బజారు రౌడీ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినవాడు. ఎనిమిదేళ్ల వయసులో బాల నటుడిగా పరిచయమయ్యాడు. మొదటి సినిమా హిస్టారికల్ మాత్రమే కాదు, మొట్టమొదటి సినిమా స్కోప్ చిత్రం కూడా. అది అల్లూరి సీతారామరాజు. బాలనటుడిగా ఆ తర్వాత కూడా ఎన్నో చిత్రాలలో నటించాడు. దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్, నీడ, పాలు నీళ్లు వంటివి.

why ramesh babu exited from film industry

ఈ సినిమాల్లో కేవలం కాసేపు కనిపించే పాత్రలే కాదు. ఎక్కువ నిడివి ఉన్న పాత్రల్లోనూ కనిపించాడు. అమాయకత్వంతో ఆకర్షించాడు. అద్భుతమైన నటనతో మెప్పించాడు. హీరోగా మొదటి సినిమా సామ్రాట్ 1987లో వచ్చింది. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదం చుట్టుకుంది. బాలకృష్ణ నటించిన చిత్రానికి కూడా సామ్రాట్ అనుకున్నారు. అయితే టైటిల్ ముందుగా కృష్ణ రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. టైటిల్ విషయంలో ఇరువర్గాలు వెనక్కి తగ్గేది లేదనటంతో కేసు కోర్టుకు చేరింది. ఎన్టీయార్ వర్సెస్ కృష్ణ కు సంబంధించిన గొడవగా మారింది. చివరకు తీర్పు కృష్ణకు అనుకూలంగా రావడంతో బాలకృష్ణ సినిమా సాహస సామ్రాట్ అయి, రమేష్ బాబు సినిమా సామ్రాట్ గా రిలీజ్ అయింది.

మొదటి సినిమా కమర్షియల్ సక్సెస్. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలతో తనని తాను నిరూపించుకోవడమే గాక అప్పట్లో చాలామంది అభిమానం సంపాదించుకున్నాడు. చిన్నికృష్ణుడు, కలియుగ రాముడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్ టైగర్, కృష్ణ గారి అబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు, నా ఇల్లే నా స్వర్గం, మామా కోడలు, అన్నా చెల్లెలు, పచ్చతోరణం, ఎన్ కౌంటర్ వంటి చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. సినిమా, సూపర్ స్టార్ డమ్, కెమెరా లైట్ల వెలుగుజిలుగులు, అభిమానులు, సన్నాహాలు చిన్నప్పటి నుండి చూస్తూ ఎదగటం వల్ల ఆ రంగం ఆయనకు అంత ఆసక్తికరంగా కనిపించి ఉండకపోవచ్చు. గుర్తింపు కోసమో, సర్వైవల్ కోసమో పరుగులు పెట్టాల్సిన అవసరమూ కలగలేదు. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయే తప్ప వాటి కోసం పడిగాపులు, ఎదురుచూపులు లేవు.

తన దగ్గర ఏది లేదో, మనిషికి దాని గురించిన ఆరాటం ఎక్కువగా ఉంటుంది. ఉన్నవాటి పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. రమేష్ బాబు విషయంలో ఇదే జరిగి ఉంటుంది. హడావిడి ప్రపంచం, వద్దన్నా దక్కుతున్న అందలం చికాకుని కలిగించి ఉంటాయి. ఒంటరితనం కోరుకునే పరిస్థితి వచ్చి ఉంటుంది. పైగా తల్లికి దగ్గరయిన అబ్బాయిలు సహజంగానే ఫ్యామిలీ లైఫ్ కి విలువ ఇస్తారు. తల్లిదండ్రులతో, తోబుట్టువులతో, భార్యాపిల్లలతో ఉన్నప్పుడు దొరికే ఆనందం, బయట ప్రపంచంలో కనిపించదు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలనిపిస్తుంది. ఎవరో గుర్తించాలనే ఆరాటం ఉండదు. ఒకరు పొగడాలనే తాపత్రయం ఉండదు. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు పెద్దపీట వేయటం జరుగుతుంది.

ఆయన చిన్న వయసులోనే చాలా చూశారు. అందుకే అందరూ అనుకునే విజయం తనకు అవసరం లేదనుకున్నారు. అది విజయంగా భావించలేదు. భావించి ఉంటే తిరిగి రావాలనే తపన కనబడేది. పోటీలో ఉండాలని అనుకోలేదు. పోటీ పడాలని అనుకోలేదు. వార్తల్లోనూ కనబడాలని అనుకోలేదు. టివి ఛానల్స్ లో తన ముఖాన్ని చూసుకుంటూ ఉండాలని అనుకోలేదు. ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ని..శ్శ..బ్దం..గా.. తప్పుకున్నారు.!!

Admin

Recent Posts