మీరు తరచూ బయట కర్రీ పాయింట్లలో అమ్మే కూరల్ని కొని తెచ్చుకుని తింటున్నారా..? మసాలాలు, కారం దట్టించి వేసి చూసేందుకు ఆకర్షణీయంగా ఉండే కూరలను బాగా తింటున్నారా..? అయితే జాగ్రత్త. ఎందుకంటే.. మీకు జీర్ణకోశ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఉన్న చాలా వరకు కర్రీ పాయింట్లలో ఇప్పుడు లభిస్తున్న కూరలు చాలా నాసిరకంగా ఉంటున్నాయట. కానీ వాటికి మసి పూసి మారేడు కాయ చేసినట్టు మసాలాలు, కారం దట్టించి అమ్ముతున్నారట. దీంతో సహజంగానే వాటి పట్ల ఆకర్షితులైన జనాలు వాటిని కొంటున్నారట.
హైదరాబాద్ నగరంలో ఇప్పుడు కర్రీ పాయింట్లకు కొదువ లేకుండా పోయింది. ఎక్కడ చూసినా అవి దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే.. బ్యాచిలర్స్, చిన్న ఫ్యామిలీలు బాగా పెరిగాయి కదా. కనుక వారు కేవలం రైస్ వండుకుని కూరలను మాత్రం బయట కర్రీ పాయింట్లలో కొంటున్నారు. దీంతో ఫుడ్ బాధ తప్పుతుందని, వంట చేసే ఇబ్బంది ఉండదని చాలా మంది భావిస్తున్నారు. అందుకనే చాలా మంది కర్రీ పాయింట్లలో కూరలను కొంటున్నారు. ఇక కర్రీ పాయింట్లను నిర్వహించే వారు కూడా చూపరులను ఆకట్టుకునేలా మసాలాలు, ఆయిల్స్, కారం దట్టించి కూరలను వండుతున్నారు. అయితే ఇక్కడే ఓ కిటుకుంది. అదేమిటంటే…
సహజంగా ఏ రోజు కారోజు కూరలు అన్నీ అమ్ముడయ్యే కర్రీ పాయింట్లు అయితే ఓకే. రోజూ ఫ్రెష్ కూరలే దొరుకుతాయి. కానీ అలా కాకుండా కూరలు అమ్ముడుపోకుండా మిగిలిపోయాయి అనుకోండి. అప్పుడు కర్రీ పాయింట్ల నిర్వాహకులు స్టార్ట్ చేస్తారు, అసలైన దందా. అలా మిగిలిపోయిన కూరలను ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు వండిన కూరలలో కలిపి వాటిని విక్రయించేస్తారు. అయితే ఆ సమయంలో కూరలు ఆకర్షణీయంగా కనిపించేందుకు మసాలాలు, కారం, నూనెలను వాటిల్లో దట్టించేస్తారు. దీంతో సహజంగానే వాటికి ఆకర్షితులై చాలా మంది ఆ కూరలను కొంటున్నారు. ఇక కర్రీ పాయింట్లలో జరుగుతున్న మరొక దందా ఏమిటంటే…
నాసిరకం పదార్థాలను ఉపయోగించి వంటలను వండడం, నిల్వ ఉంచిన పదార్థాలు, నీటితో వంటలను చేయడం, టేస్ట్ ఉంటుందని చెప్పి రసాయనాలు, ఫుడ్ కలర్స్ వేసి వంటలను వండడం. దీంతో అలా వండిన కూరలను తిన్నవారు జీర్ణకోశ సమస్యల బారిన పడుతున్నారు. ఇక కర్రీ పాయింట్లలో సహజంగానే కర్రీలను ఉంచే పాత్రలపై మూతలను పెట్టరు. దీంతో వాటిల్లో ఏం పురుగులు, ఈగలు పడేవి కూడా తెలియదు. దీనికి తోడు కర్రీలను ఇచ్చే సమయంలో వాటిని కట్టిచ్చే వారికి చెమట కారితే అదే చేత్తో తుడుచుకుంటారు. అదే చేత్తో కర్రీ కడతారు. దాన్నే మనకు ఇస్తారు. ఇది ఎంత అపరిశుభ్రంగా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. కనుక మీరు గనక కర్రీ పాయింట్లలో తింటుంటే ఇకనైనా జాగ్రత్త వహించండి. వీలైనంత వరకు సొంతంగా వంట చేసుకోండి. లేదంటే కర్రీ పాయింట్లలోని కూరలను తింటే జీర్ణకోశ వ్యాధులకు, ఫుడ్ పాయిజన్, ఇన్‌ఫెక్షన్లకు గురి కావల్సి వస్తుంది..! కాబట్టి జాగ్రత్త..!