Cinnamon : మనం వంటల్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిని ఎంతోకాలం నుండి మనం వంటల్లో ఉపయోగిస్తూ ఉన్నాం. దాల్చిన చెక్కను వాడడం వల్ల మనం చేసే వంటల రుచి, వాసన పెరుగుతాయి. మసాలా కూరలు, బిర్యానీ, నాన్ వెజ్ వంటకాల్లో దీనిని విరివిరిగా ఉపయోగిస్తారు. దీనికి దారుసీత అనే పేరు కూడా ఉంది. అంటే తియ్యని మాను కలది అని అర్థం. కూరల్లో మసాలా దినుసుగా మాత్రమే ఉపయోగించే దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
దాల్చినచెక్కను ఉపయోగించి ఔషధాలు కూడా తయారు చేస్తారు. దాల్చిన చెక్క సింగమామం అనే చెట్టు బెరడు నుండి లభిస్తుంది. దీనితో సీతోఫలాధి చూర్ణం, ద్వగాది లేహ్యం, ద్వగాది చూర్ణం వంటి ఆయుర్వేద ఔషధాలు తయారవుతాయి. దాల్చిన చెక్కను పొడిగా చేసి నీటిలో కలుపుకుని తాగడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. వాత వ్యాధులను తగ్గించడంలో దాల్చిన చెక్క చక్కగా పని చేస్తుంది. దీనిని వాడడం వల్ల కడుపులో వాతం చాలా బాగా తగ్గుతుంది. దాల్చిన చెక్క రసాన్ని తీసుకోవడం వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే విషతుల్యమైన పదార్థాలు తొలగిపోతాయి.
అలాగే శరీరంలో నీరు అధికమై బాధపడే వారు కూడా మనలో చాలా మంది ఉండే ఉంటారు. అలాంటి సమయంలో దాల్చిన చెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో అధికంగా చేరిన నీరు తొలిగిపోతుంది. పార్శ్వపు నొప్పి అధికంగా ఉన్నవారు దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల నొప్పి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. స్వరపేటిక వాపు, బొంగురుపోవడం వంటి సమస్యలు ఉన్న వారు దాల్చిన చెక్కను నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ రసాన్ని మింగుతూ ఉంటే ఆయా సమస్యలు తగ్గుముఖం పడతాయి.
స్త్రీలల్లో వచ్చే రుతు దోషాలను తొలగించడంలో కూడా దాల్చిన చెక్క దివ్యౌషధంగా పని చేస్తుంది. దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. గర్భ దోషాలు తొలగిపోతాయి. గ్యాస్ సమస్యతో బాధపడే వారు దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జిగట విరేచనాలను కూడా దాల్చిన చెక్కను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. జిగట విరేచనాలతో బాధపడుతున్నప్పుడు దాల్చిన చెక్కను ఉడికించి మెత్తగా పేస్ట్ గా చేయాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నెయ్యిని, బెల్లాన్ని కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గిపోతాయి.
చర్మం ముడతలు పడడం, రంగు తగ్గడం జరిగినప్పుడు దాల్చిన చెక్క పొడిని, గంధం పొడిని గులాబీ నీటిలో కలిపి పేస్ట్ గా చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫ్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం రంగు పెరగడంతోపాటు చర్మంపై ఉండే ముడతలు కూడా తొలగిపోతాయి. దాల్చిన చెక్క పొడిని, నిమ్మరసాన్ని కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. రక్తహీనత సమస్యతో బాధపడే వారు అర గ్లాస్ దానిమ్మరసంలో పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని, అర టీస్పూన్ తేనెను కలిపి తీసుకోవడం వల్ల రక్తవృద్ధి జరుగుతుంది.
అజీర్తి కారణంగా వాంతులు అవుతున్నప్పుడు దాల్చిన చెక్క పొడిని, శొంఠి పొడిని, జీలకర్ర పొడిని సమభాగాలుగా తీసుకోవాలి. తరువాత దానిలో అర టీ స్పూన్ తేనెను కలిపి రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడంతోపాటు వాంతులు, విరేచనాలు కూడా తగ్గుతాయి. దంతాల నొప్పులతో బాధపడే వారు దాల్చిన చెక్క నూనెలో దూదిని ముంచి నొప్పి ఉన్న దంతాలపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల దంతాల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఫ్లూ జ్వరం బాధిస్తున్నప్పుడు మూడున్నర గ్రాముల దాల్చిన చెక్క, 600 మిల్లీ గ్రాములు లవంగాలు, 2 గ్రాముల శొంఠిని తీసుకుని ఒక లీటర్ నీటిలో వేసి మరిగించాలి. ఈ నీరు పావు లీటర్ కషాయంగా మారిన తరువాత వడకట్టి పూటకు 50 మిల్లీ లీటర్ల మోతాదులో మూడు పూటలా తీసుకోవడం వల్ల జ్వరం త్వరితగతిన తగ్గుతుంది.
దాల్చిన చెక్కను నూనెను కళ్లు మూసి కనురెప్పలపై రాయడం వల్ల కళ్ల నొప్పులు తగ్గడంతోపాటు కళ్లు ప్రకాశవంతంగా కూడా తయారవుతాయి. కళ్లు అసంకల్పంగా కొట్టుకోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. దాల్చిన చెక్కను ఉపయోగించి మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని దాల్చిన చెక్కను వాడడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.