Kaju Katli : మనకు బయట స్వీట్ షాపుల్లో లభించే వాటిల్లో కాజు కట్లీ కూడా ఒకటి. జీడిపప్పుతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. బయట లభించే విధంగా ఉండే ఈ కాజు కట్లీ ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం కూడా. ఇంట్లో రుచిగా కాజు కట్లిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాజు కట్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
జీడిపప్పు – ఒక కప్పు, కాచిచల్లార్చిన పాలు – పావు కప్పు, పంచదార – అర కప్పు, నీళ్లు – పావు కప్పు, యాలకుల పొడి – ఒక టీ స్పూన్.
కాజుకట్లీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో జీడిపప్పును తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత అందులో పాలను పోసి మరలా మిక్సీ పట్టి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు అడుగ భాగం మందంగా ఉండే కళాయిని తీసుకుని అందులో పంచదారను, నీళ్లను పోసి కలుపుతూ వేడి చేయాలి. దీనిని పంచదార కరిగి ముదురు తీగ పాకం వచ్చే వరకు వేడి చేయాలి. తరువాత మంటను చిన్నగా చేసి ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ను వేసి అడుగు భాగం మాడిపోకుండా కలుపుతూ వేడి చేయాలి.
జీడిపప్పు పేస్ట్, పంచదార మిశ్రమం పూర్తిగా కలిసిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. జీడిపప్పు మిశ్రమం కళాయికి అంటుకోకుండా ముద్దగా అయ్యే వరకు కలుపుతూ వేయించాలి. ఇలా ముద్దగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత దీనిని మరో రెండు నిమిషాల పాటు బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్ మీద కానీ, నెయ్యి రాసిన ప్లేట్ మీదకు కానీ తీసుకోవాలి. తరువాత దీనిని చపాతీ కర్రతో అర ఇంచు మందం ఉండేలా చపాతీలా రుద్దాలి.
ఇలా రుద్దిన తరువాత దీనిని మనకు కావల్సిన పరిమాణంలో కావల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అచ్చం బయట స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే కాజు కట్లీ తయారవుతుంది. దీనిపై సిల్వర్ పేపర్ ను వేసి గార్నిష్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కాజు కట్లీని చాలా తక్కువ ఖర్చులో, చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన కాజు కట్లీని అందరూ ఇష్టంగా తింటారు.