Drumstick Leaves Facts : అనేక పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న వాటిల్లో మునగాకులు కూడా ఒకటి. సాధారణంగా మనం మునక్కాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మునక్కాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే కేవలం మునక్కాయలే కాకుండా మునగాకులు కూడా మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మునగాకులో ఉండే పోషకాలు అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మునగాకులో విటమిన్ ఎ, సి, ఇ లతో పాటు క్యాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే వీటితో పాటు క్వెర్సెటివ్, క్లోరోజెనిక్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడింట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ను నిర్మూలించడంలో, కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో దోహదపడతాయి. మునగాకులను తీసుకోవడ వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఈ ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. ఆకలి కూడా తగ్గుతుంది.
దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే మునగాకులను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ప్రేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేగులకు పోషకాలను గ్రహించే శక్తి పెరుగుతుంది. అలాగే మునగాకులను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకులను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఇవి మనకు దోహదపడతాయి.
ఈ విధంగా మునగాకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులను ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. మునగాకులతో ఇతర ఆకుల వలె పప్పును తయారు చేసుకోవచ్చు. అలాగే కారం పొడిని తయారు చేసుకుని అన్నంతో కలిపి తీసుకోవచ్చు. అలాగే కూరల్లో కరివేపాకును వేసినట్టుగా మునగాకును కూడా వేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మునగాకును నీటిలో మరిగించివడకట్టి ఆ కషాయాన్ని కూడా తాగవచ్చు. ఈ విధంగా ఏ రూపంలో తీసుకున్నా కూడా మునగాకు మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.