మనలో చాలా మంది కంటి చుట్టూ నల్లని వలయాలతో బాధపడుతూ ఉంటారు. ముఖం అందంగా ఉన్నప్పటికీ కంటి చుట్టూ ఉండే నల్లని వలయాల కారణంగా వారు అందవిహీనంగా కనబడుతుంటారు. కారణాలేవైనప్పటికీ ఈ సమస్య నుండి బయటపడడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. కంటి చుట్టూ ఉండే చర్మం సున్నితంగా ఉంటుంది. రసాయనాలు కలిగిన క్రీములను, ఫేస్ వాష్ లను వాడడం వల్ల కంటి చుట్టూఉండే చర్మం మరింత నల్లగా మారే లేదా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనుక సహజసిద్ధమైన పదార్థాలను వాడి కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలను తొలగించుకోవాలి.
ఇంటి చిట్కాలను ఉపయోగించి చాలా సులభంగా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలను తొలగించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మనం కీరదోస, బంగాళాదుంప, టమాటాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా కీరదోసను ముక్కలుగా చేసి జార్ లోకి తీసుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుని దాని నుండి రసాన్ని తీయాలి. అదే విధంగా బంగాళాదుంప నుండి కూడా రసాన్ని తీయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కీరదోస రసాన్ని, ఒక టేబుల్ స్పూన్ బంగాళాదుంప రసాన్ని, అలాగే ఒక టేబుల్ స్పూన్ టమాట రసాన్ని తీసుకోవాలి. ఈ మూడు కలిసేలా బాగా కలపాలి.
తరువాత ఇందులోనే ఒక టీ స్పూన్ తేనెను, ఒక టీ స్పూన్ కలబంద గుజ్జును వేసి బాగా కలపాలి. తరువాత దూదిని తీసుకుని రెండు భాగాలుగా చేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమంలో ముంచాలి. తరువాత ఈ దూదిని రెండు కళ్లపై ఉంచుకోవాలి. ఇలా చేసిన 20 నిమిషాల తరువాత కళ్లను వేడి నీటితో శుభ్రపరుచుకోవాలి. తరువాత కంటి చుట్టూ వేళ్లతో 5 నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తూ ఉండడం వల్ల క్రమంగా కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలు తొలగిపోతాయి.
అలాగే కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలను తొలగించే రెండో చిట్కా గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ బాదం నూనె, ఒక టీ స్పూన్ కలబంద గుజ్జును, ఒక టీ స్పూన్ వాసిలిన్ ను తీసుకోవాలి. ఇవి అన్నీ కలిసేలా బాగా కలపాలి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కళ్ల చుట్టూ రాసుకోవాలి. ఉదయం లేవగానే కళ్లను నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల చాలా త్వరగా కళ్ల చుట్టూ ఉండే నల్లని వలయాలు తొలగిపోతాయి.
ఈ చిట్కాలను పాటిస్తూనే నీటిని ఎక్కువగా తాగడం, పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, చక్కగా నిద్రపోవడం, టీవీ, సెల్ ఫోన్ వంటి వాటిని తక్కువగా వాడడం వంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలు తొలగిపోవడమే కాకుండా మరలా రాకుండా కూడా ఉంటాయి.