టమాటో మసాలా రైస్ ను ఎప్పుడైనా ఇలా చేశారా.. రుచి మాములుగా ఉండదు..

మ‌న వంటింట్లో ఎల్ల‌ప్పుడూ ఉండే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. వీటిని మ‌నం త‌ర‌చూ వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. ట‌మాటాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ట‌మాటాల‌తో మ‌నం చేసే వివిధ ర‌కాల వంట‌కాల్లో ట‌మాట రైస్ కూడా ఒక‌టి. త‌ర‌చూ చేసే ట‌మాట రైస్ కు భిన్నంగా మ‌సాలా దినుసులు వేసి దీనిని మ‌రింత రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట మ‌సాలా రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యం – ఒక గ్లాస్, ట‌మాటాలు – పావు కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండు మిర్చి – 1, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన పుదీనా – కొద్దిగా, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, ప‌సుపు – చిటికెడు, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, నీళ్లు – ఒక‌టింపావు గ్లాస్.

tomato masala rice very good taste prepare in this method

మ‌సాలా దినుసులు..

బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క ముక్క‌లు – 2 ( చిన్న‌వి), ల‌వంగాలు – 2, యాల‌కులు – 2, అనాస పువ్వు – 1, మ‌రాఠీ మొగ్గ – 1, సాజీరా – ఒక టీ స్పూన్, జాప‌త్రి – కొద్దిగా.

ట‌మాట మ‌సాలా రైస్ త‌యారీ విధానం..

ఇందుకోసం ముందుగా ట‌మాటాల‌ను తీసుకుని ముక్క‌లుగా కోసి ఒక గిన్నెలో వేసి మెత్త‌గా ఉడికించుకోవాలి. త‌రువాత ఈ ట‌మాట ముక్క‌ల‌ను జార్ లో వేసి మెత్త‌గా పేస్ట్ లా చేసుకోవాలి. త‌రువాత ఒక కుక్క‌ర్ లో నూనె వేసి నూనె కాగిన త‌రువాత మ‌సాలా దినుసుల‌ను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత ఎండు మిర్చిని, ప‌చ్చి మిర్చిని, క‌రివేపాకును, ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి క‌లిపి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించుకోవాలి.

త‌రువాత ఉప్పును, కారాన్ని, ధ‌నియాల పొడిని, గ‌రం మ‌సాలాను, ప‌సుపును వేసి క‌లిపి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. త‌రువాత పుదీనాను, కొత్తిమీర‌ను కూడా వేసి క‌లిపి వేయించుకోవాలి. త‌రువాత ముందుగా చేసి పెట్టుకున్న ట‌మాట పేస్ట్ ను వేసి క‌లిపి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత నాన‌బెట్టుకున్న బాస్మ‌తి బియ్యాన్ని వేసి క‌లిపి మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత నీళ్ల‌ను పోసి కలిపి మూత పెట్టాలి.

దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి ట‌మాట రైస్ ను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట మ‌సాలా రైస్ త‌యార‌వుతుంది. దీనిని నేరుగా లేదా రైతాతో క‌లిపి తిన‌వ‌చ్చు. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు లేదా వంట చేయ‌డానికి స‌మ‌యం లేన‌ప్పుడు ఇలా ట‌మాటాల‌తో మ‌సాలా రైస్ ను చేసుకుని తిన‌వ‌చ్చు. ఇలా చేసిన ట‌మాట మ‌సాలా రైస్ ను అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
Admin

Recent Posts