Oil For Dandruff : మనకు సులభంగా లభించే పదార్థాలతో నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు సమస్యలను దూరం చేసుకోవచ్చని మీకు తెలుసా..! నేటి తరుణంలో మనలో చాలా మంది చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, రసాయనాలు కలిగిన హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడడం వంటి వివిధ కారణాల చేత జుట్టు సమస్యల బారిన పడుతున్నారు. ఇలా జుట్టు సమస్యలతో బాధపడే వారు మనకు అందుబాటులో ఉండే పదార్థాలను వాడి జుట్టు సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు.
అంతేకాకుండా ఈ నూనెను వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు సమస్యలన్నింటిని దూరం చేసే ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలి… ఎలా వాడాలి.. అలాగే నూనె తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను తయారు చేసుకోవడానికి గానూ మనం ఒక గ్లాస్ ఆవ నూనెను, ఒక టీ స్పూన్ మెంతులను, ఒక టీ స్పూన్ కాళోంజి విత్తనాలను, 4 రెబ్బల కరివేపాకును, 4 మందార ఆకులను అలాగే అర కప్పు ఉల్లిపాయ ముక్కలను ఉపయోగించాల్సి ఉంటుంది.
ఈ నూనె తయారీలో వాడిన ప్రతి పదార్థం కూడా ఎన్నో ఔషధ గుణాలను, పోషకాలను కలిగి ఉంటాయి. అలాగే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కూడా కలిగి ఉంటాయి. ఈ పదార్థాలను నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు కావల్సిన పోషకాలు అంది జుట్టు పెరుగుదల చక్కగా ఉంటుంది. అలాగే వీటిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. మన జుట్టు పెరుగుదలకు దోహదపడే ఈ నూనెను తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఆవ నూనెను తీసుకోవాలి. తరువాత ఇందులో పైన చెప్పిన మిగిలిన పదార్థాలను వేసి 10 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. నూనె చల్లారిన తరువాత వడకట్టి నిల్వ చేసుకోవాలి.
ఈ నూనె 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. కనుక ఒకేసారిఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని వాడవచ్చు. ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు బాగా పట్టించాలి. తరువాత నూనె కుదుళ్లల్లోకి ఇంకేలా మర్దనా చేసుకోవాలి. దీనిని గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత రసాయనాలు లేని షాంపుతో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. అదే విధంగాచుండ్రు సమస్యతో బాధపడే వారు ఈ నూనెను క్రమం తప్పకుండా వారం రోజుల పాటు వాడాలి. ఇలా వాడడం వల్ల చుండ్రు సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.