information

Atal Pension Yojana : రోజుకు రూ.7 పొదుపు చేస్తే.. నెల‌కు రూ.5000 పొంద‌వ‌చ్చు..!

Atal Pension Yojana : కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల కోసం కొత్త‌గా యునిఫైడ్ పెన్ష‌న్ స్కీమ్ (UPS) ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్ (NPS) అందుబాటులో ఉంది. అయితే ఉద్యోగుల డిమాండ్ మేర‌కు కేంద్రం దిగి వ‌చ్చింది. దీంతో ఓ వైపు యూపీఎస్‌తోపాటుమ‌రో వైపు ఎన్‌పీఎస్ స్కీమ్ కూడా కొన‌సాగుతుంద‌ని, ఎవ‌రికి న‌చ్చిన స్కీమ్‌లో వారు త‌మ డ‌బ్బును పొదుపు చేసుకోవ‌చ్చ‌ని తెలియ‌జేసింది. అయితే ఈ స్కీమ్స్ రెండూ కూడా కేంద్ర లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్తించే ప‌థ‌కాలు. మ‌రి సామాన్య ప్ర‌జ‌లు లేదా అసంఘటిత రంగంలో ప‌నిచేస్తున్న వారికి ఇలాంటి పెన్ష‌న్ స్కీమ్‌లు లేవా..? అంటే ఉన్నాయి. అదే అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న (APY). దీన్ని కేంద్ర ప్ర‌భుత్వం గతంలోనే ప్ర‌వేశ‌పెట్టింది. ఇక ఈ ప‌థ‌కం వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న (APY) లో భాగంగా 18 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న ఎవ‌రైనా స‌రే డ‌బ్బును నెల‌కు కొంత మొత్తంలో పొదుపు చేసుకోవ‌చ్చు. డ‌బ్బును చిన్న మొత్తంలో పొదుపు చేసుకున్నా చాలు, రిటైర్ అయ్యాక నెల‌కు రూ.1000 క‌నీస పెన్ష‌న్ పొంద‌వ‌చ్చు. గ‌రిష్టంగా రూ.5000 వ‌ర‌కు నెల నెలా పెన్ష‌న్ పొంద‌వ‌చ్చు. అయితే ఈ APY ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఈ స్కీమ్‌ను నిర్వ‌హిస్తోంది. అందువ‌ల్ల ఇది ప్ర‌భుత్వ ప‌థ‌కం అని చెప్ప‌వ‌చ్చు. ఇందులో మీరు డ‌బ్బును పొదుపు చేసుకుంటే దానికి పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ ఉంటుంది.

Atal Pension Yojana full details and how to apply

18 నుంచి 40 ఏళ్ల వారు..

ఇక APY స్కీమ్‌లో 18వ ఏట నుంచే డ‌బ్బును పొదుపు చేయ‌వ‌చ్చు. కానీ గ‌రిష్ట వ‌యో ప‌రిమితి మాత్రం 40 ఏళ్లుగా నిర్ణ‌యించారు. అంటే 40 ఏళ్ల లోపు వ‌ర‌కు వ‌య‌స్సు ఉన్న వ్య‌క్తులు ఈ ప‌థ‌కంలో చేర‌వ‌చ్చు. దీంట్లో భాగంగా మీరు 18వ ఏట నుంచి నెల‌కు రూ.42 పొదుపు చేస్తే మీకు 60 ఏళ్లు నిండిన త‌రువాత ఈ ప‌థ‌కం మెచూర్ అవుతుంది. అప్ప‌టి నుంచి మీకు నెల‌కు రూ.1000 క‌నీస పెన్ష‌న్ వ‌స్తుంది.

ఇక మీరు 18వ ఏట నుంచి నెల‌కు రూ.210 పొదుపు చేస్తే మీకు 60 ఏళ్లు నిండిన త‌రువాత నెల‌కు రూ.5000 పెన్ష‌న్ ఇస్తారు. ఇలా మీరు నెల నెలా పొదుపు చేసే మొత్తాన్ని బ‌ట్టి మీకు 60 ఏళ్లు నిండిన త‌రువాత వ‌చ్చే పెన్ష‌న్ మొత్తం మారుతుంది. ఇక నెల‌కు రూ.210 అంటే మీరు ఒక్క రోజుకు చూసుకుంటే కేవ‌లం రూ.7 అవుతుంది. అంటే ఇప్ప‌టి నుంచే మీరు నెల‌కు రూ.7 పొదుపు చేస్తే 60 ఏళ్లు నిండిన త‌రువాత ఏకంగా నెల‌కు రూ.5వేల పెన్ష‌న్ పొంద‌వ‌చ్చ‌న్న‌మాట‌. పైగా కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తుంది క‌నుక మీ డ‌బ్బుకు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కూడా ఉంటుంది.

అంద‌రికీ ల‌బ్ధి చేకూరేలా..

అయితే ఈ ప‌థ‌కంలో చేరిన త‌రువాత ఖాతాదారు మ‌ర‌ణిస్తే అప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన మొత్తాన్ని నామినీకి ఇస్తారు. ఇలా ఈ ప‌థ‌కం ద్వారా పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన వారు ల‌బ్ధి పొంద‌వ‌చ్చు. దీంట్లో డ‌బ్బును చ‌క్క‌గా పొదుపు చేసుకోవ‌చ్చు. దాదాపుగా అన్ని బ్యాంకుల్లోనూ ఈ ప‌థ‌కం అందుబాటులో ఉంది.

Admin

Recent Posts