గోళ్లు కొరకడం అనేది కొందరికి చిన్నప్పటి నుంచే అలవాటు అవుతుంది. దాన్ని వారు మానలేరు. పెద్దయ్యాక కూడా గోళ్లను కొరుకుతూనే ఉంటారు. ఇక కొందరికి పెద్దయ్యాక అలవాటు అవుతుంది. అయితే గోళ్లు ఎందుకు కొరుకుతారు ? దాని వెనుక ఉండే కారణాలు ఏమిటి ? గోళ్లు కొరికితే ఏమవుతుంది ? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఎవరైనా సరే ఆందోళనగా, ఒత్తిడితో ఉన్నా, కంగారు పడుతున్నా.. ఆ భావాలను అణచుకునేందుకు గోళ్లను కొరుకుతుంటారు. దీన్నే వైద్య పరిభాషలో onychophagia అంటారు.
ఇక గోళ్లు కొరకడం అనేది చిన్నప్పటి నుంచే కొందరికి అలవాటు అవుతుంది. దాన్ని వారు అలవాటుగా మార్చుకుంటారు. ఇలాంటి వారు ఒత్తిడి, ఆందోళన లేకున్నా పదే పదే గోళ్లను కొరుకుతుంటారు. ఇలా అలవాటు ఉంటే మార్చడం కష్టం. కొందరు బోర్ కొట్టడం వల్ల కూడా గోళ్లను కొరుకుతుంటారు. వంశపారంపర్యంగా కూడా ఈ అలవాటు వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే గోళ్లను కొరకడం అనేది నిజానికి ఆరోగ్యానికి మంచిది కాదు. గోళ్లలో అనేక సూక్ష్మ క్రిములు ఉంటాయి. కనుక తరచూ దగ్గు, జలుబు, జ్వరం లేదా జీర్ణ సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల గోళ్లను కొరకడం మానేయాలి. ఇక జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాల ప్రకారం చూసినా గోళ్లను కొరకడం మంచిది కాదు. గోళ్లను కొరికితే అశుభం కలుగుతుంది. కనుక అలా చేయరాదు.