వైద్య విజ్ఞానం

Glycemic Index : గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) అంటే ఏమిటి ? డ‌యాబెటిస్ ఉన్న‌వారికి దీంతో ఏం సంబంధం ?

Glycemic Index : ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న వ్యాధుల్లో డ‌యాబెటిస్ కూడా ఒక‌టి. ఇందులో రెండు ర‌కాలు ఉంటాయి. టైప్ 1, టైప్ 2 డ‌యాబెటిస్ అని ఉంటాయి. టైప్ 1 డ‌యాబెటిస్ వంశ పారంప‌ర్యంగా వ‌స్తుంది. టైప్ 2 డ‌యాబెటిస్ అస్త‌వ్యస్త‌మైన జీవన విధానం వ‌ల్ల వ‌స్తుంది. అయితే ఏ డ‌యాబెటిస్ ఉన్న‌వారు అయినా స‌రే త‌మ ఆహారంలో త‌క్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) ఉండే ప‌దార్థాల‌ను చేర్చుకోవాలి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.

సాధార‌ణంగా మ‌నం తినే ఆహారాల్లో ఉండే కార్బొహైడ్రేట్లు (పిండి ప‌దార్ధాలు) మ‌న శ‌రీరంలో గ్లూకోజ్‌గా మారుతాయి. ర‌క్తంలో గ్లూకోజ్ లెవ‌ల్స్ ఎక్కువైతే ఆ స్థితిని డ‌యాబెటిస్ అంటారు. అయితే మ‌నం తినే ఆహార ప‌దార్థాల‌ను బ‌ట్టి వాటిల్లో పిండి ప‌దార్థాల శాతం ఎక్కువ‌గా, త‌క్కువ‌గా ఉంటుంది. పిండి ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తింటే మ‌న ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు వెంట‌నే పెరుగుతాయి. వీటినే హై గ్లైసీమిక్ ఇండెక్స్ ప‌దార్థాలు అంటారు. వీటిని డ‌యాబెటిస్ ఉన్న‌వారు తిన‌రాదు. మ‌నం తినే ఆహారాల వ‌ల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే శాతాన్ని గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు. దీనికి ఒక విలువ ఇస్తారు. అంటే ఒక్కో ప‌దార్థానికి ఒక్కో జీఐ విలువ ఉంటుంది. జీఐ విలువ ఎక్కువ‌గా ఉందంటే.. ఆ ప‌దార్థాన్ని తిన్న వెంట‌నే మ‌న ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు వెంట‌నే పెరుగుతాయ‌ని అర్థం. క‌నుక డ‌యాబెటిస్ ఉన్న వారు జీఐ విలువ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను అస్స‌లు తిన‌రాదు.

ఇక జీఐ విలువ మ‌ధ్య‌స్థంగా ఉండే ఆహారాల‌ను త‌క్కువ మోతాదులో డయాబెటిస్ ఉన్న‌వారు తీసుకోవ‌చ్చు. అదే జీఐ విలువ చాలా త‌క్కువ‌గా ఉండే ఆహారాల‌ను అయితే వారు నిత్యం తీసుకోవ‌చ్చు. ఆ ప‌దార్థాల వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు కనుక వాటిని నిత్యం తీసుకోవ‌చ్చు.

what is glycemic index and what it does

జీఐ విలువ 70 అంత‌క‌న్నా ఎక్కువ‌గా ఉంటే వాటిని అధిక జీఐ క‌లిగిన ఆహారాల‌ని అంటారు. 56 నుంచి 69 మ‌ధ్య జీఐ విలువ ఉంటే ఆ ప‌దార్థాలను మ‌ధ్య‌స్థ జీఐ విలువ క‌లిగిన ఆహారాల‌ని, అదే 55 అంత‌క‌న్నా త‌క్కువ‌గా జీఐ విలువ ఉంటే వాటిని త‌క్కువ జీఐ విలువ క‌లిగిన ఆహారాల‌ని పిలుస్తారు. క‌నుక డ‌యాబెటిస్ ఉన్న‌వారు జీఐ విలువ 55 అంత‌క‌న్నా తక్కువ క‌లిగిన ఆహారాల‌నే తినాల్సి ఉంటుంది. వాటి వ‌ల్ల చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌వు. క‌నుక డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

ఇక జీఐ విలువ అనేది కేవ‌లం పిండి ప‌దార్థాలు ఉండే ప‌దార్థాల‌కే వ‌ర్తిస్తుంది. ప్రోటీన్లు, కొవ్వులు మాత్ర‌మే ఉండే ఆహారాల‌కు జీఐ విలువ ఉండ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు బీఫ్, చికెన్‌, చేప‌లు, గుడ్లు, మూలిక‌లు, మ‌సాలాల్లో పిండి ప‌దార్థాలు ఉండ‌వు. లేదా చాలా సూక్ష్మ ప‌రిమాణంలో ఉంటాయి. అందువ‌ల్ల వీటికి జీఐ విలువ ఉండ‌దు.

గోధుమ‌లు, బార్లీ, చిరు ధాన్యాలు, తృణ ధాన్యాలు, పండ్లు, కూర‌గాయ‌లు, ప‌ప్పు దినుసులు, పాలు, పెరుగు, బాదం పాలు, సోయా పాలు త‌దిత‌ర ఆహారాల్లో జీఐ విలువ త‌క్కువ‌గా ఉంటుంది. క‌నుక డ‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని నిత్యం తీసుకోవ‌చ్చు. అలాగే న‌ట్స్‌, ఆలివ్ ఆయిల్‌, వెన్న‌, అవ‌కాడో, వెల్లుల్లి, తుల‌సి, మిరియాలు, అల్లం వంటి వాటిని కూడా తీసుకోవచ్చు.

తెల్ల బ్రెడ్‌, అన్నం, పాస్తా, నూడుల్స్, పుచ్చ‌కాయ‌లు, చిప్స్‌, కేకులు, కుకీస్‌, బిస్కెట్లు, ఇత‌ర బేక‌రీ ప‌దార్థాలు, జంక్ ఫుడ్స్‌, తియ్య‌ని ప‌దార్థాలు ఎక్కువ జీఐ విలువ‌ను క‌లిగి ఉంటాయి. కాబ‌ట్టి డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తులు వాటిని తిన‌రాదు.

Admin

Recent Posts