మనం ఆహారంలో భాగంగా అప్పుడప్పుడూ అటుకులను కూడా తీసుకుంటూ ఉంటాం. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అటుకుల్లో కూడా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో ఉన్నాయి. మనం అటుకులతో వివిధ రకాల చిరు తిళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా ఆరోగ్యానికి మేలు చేసేలా అటుకులతో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – ఒక కప్పు, నెయ్యి – 4 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి పొడి – పావు కప్పు, బెల్లం తురుము – పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ, యాలకుల పొడి – అర టీ స్పూన్, జీడిపప్పు – కొద్దిగా, ఎండు ద్రాక్ష – కొద్దిగా.
అటుకుల తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో అటుకులను తీసుకుని వాటిని మధ్యస్థ మంటపై పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలి. తరువాత ఈ అటుకులను ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడయ్యక కొబ్బరి పొడిని వేసి రంగు మారే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి పొడిని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు బెల్లం తురుమును, యాలకుల పొడిని, అటుకుల మిశ్రమాన్ని వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
తరువాత ఒక చిన్న కళాయిలో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తరువాత జీడిపప్పును, ఎండు ద్రాక్షను వేసి వేయించుకోవాలి. తరువాత వీటిని నెయ్యితో సహా ముందుగా కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమంలో వేసి వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కావల్సిన పరిమాణంలో తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఒకవేళ లడ్డూలు విరిగిపోతుంటే అందులో కాచి చల్లార్చిన పాలను కలుపుతూ లడ్డూలను చుట్టుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల డ్డూలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఈ విధంగా అటుకులతో లడ్డూలను చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.