Mosquitoes : ప్రస్తుత తరుణంలో చాలా మంది దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం కావడంతో దోమలు అధికంగా వస్తున్నాయి. ముఖ్యంగా నీరు నిల్వ ఉండే చోట్ల ఇవి తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి. అలాగే ఈ వాతావరణం కూడా వీటికి అనుకూలంగా ఉంటుంది. కనుక దోమలు ఎక్కువగా ఈ సీజన్‌లోనే వృద్ధి చెందుతుంటాయి. అలా భారీగా దోమలు ఏర్పడి మనపై దాడి చేస్తాయి. మనకు రోగాలను కలగజేస్తాయి. కనుక దోమలను తరిమే ప్రయత్నం చేయాలి.
అయితే దోమలను తరిమేందుకు మనకు మార్కెట్‌లో అనేక రకాల రసాయన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి విడిచిపెట్టే గాలిని పీల్చడం వల్ల మనకు శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు వస్తాయి. కనుక వాటిని చాలా మంది వాడడం లేదు. అయితే మరి దోమలను ఎలా వదిలించుకోవాలి.. అంటే.. అందుకు కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటించాలి. దీంతో దోమలను తరిమేయవచ్చు. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్పూరం బిళ్లలు కొన్నింటిని తీసుకుని వాటికి వేపాకులు కలపాలి. అనంతరం వాటికి మంటపెట్టాలి. దీంతో పొగ వస్తుంది. ఈ పొగను ఇంట్లో వేయాలి. అలా వేసేటప్పుడు ఇంటి తలుపులు, కిటికీలు మూసేయాలి. దీంతో ఆ పొగకు దోమలు చనిపోతాయి. ఇలా దోమల నుంచి విముక్తి పొందవచ్చు.
ఆవాల పొడి, వేపాకుల పొడి, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని బొగ్గులపై చల్లాలి. ఇల్లంతా ధూపంలా వేయాలి. దీంతో దోమలు పోతాయి. అలాగే వెల్లుల్లిని దంచి కాస్త నెయ్యి లేదా నూనెతో కాస్త కర్పూరం కలిపి వెలిగించాలి. దీంతో వచ్చే పొగకు దోమలు పారిపోతాయి. ఇక మిరియాల ఆకులను కాల్చి పొగ వేయాలి. ఇలా చేసినా కూడా దోమలు పారిపోతాయి. మళ్లీ రావు. ఇలా సహజసిద్ధమైన చిట్కాలను ఉపయోగించి దోమల బెడద నుంచి బయట పడవచ్చు.