Godhumapindi Mysore Bonda : మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో మైసూర్ బోండాలు కూడా ఒకటి. మైసూర్ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాధారణంగా ఈ మైసూర్ బోండాలను మనం మైదాపిండితో తయారు చేస్తూ ఉంటాము. మైదాపిండితో చేసే ఈ బోండాలు రుచిగా ఉన్నప్పటికి వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కనుక ఈ బోండాలను మైదాపిండికి బదులుగా గోధుమపిండితో చేసుకోవడం మంచిది. గోధుమపిండితో చేసే ఈ మైసూర్ బోండాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. గోధుమపిండితో చేసే ఈ బోండాలను తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలగకుండా ఉంటుంది. గోధుమపిండితో రుచికరమైన మైసూర్ బోండాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి మైసూర్ బోండా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, బియ్యంపిండి – 2 టీ స్పూన్స్, పెరుగు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీస్పూన్, చిరన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తరుగు – ఒక టేబుల్ స్పూన్స్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
గోధుమపిండి మైసూర్ బోండా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో బియ్యంపిండి వేసి కలపాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. అవసరమైతే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత పిండిని 3 నుండి 4 నిమిషాల పాటు పైకి కిందికి బాగా బీట్ చేసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పిండిని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. పిండి చక్కగా నానిన తరువాత మరో 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మంటను చిన్నగా చేసి చేతులకు తడి చేసుకుంటూ పిండిని తీసుకుని బోండాలుగా వేసుకోవాలి. ఇలా తగినన్ని బోండాలను వేసుకున్న తరువాత మంటను మధ్యస్థంగా చేసి బోండాలను ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి బోండాలు తయారవుతాయి. వీటిని చట్నీ, సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా గోధుమపిండితో చేసిన బోండాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.