Growing Tomatoes : నేటి కాలంలో చాలా మంది ఇంట్లోనే కూరగాయలను సాగు చేసుకుంటున్నారు. ఎవరి వీలును బట్టి వారు మట్టిలో, కుండీలల్లో మొక్కలను పెంచుకుంటున్నారు. మనం ఇంట్లోనే సులభంగా పెంచుకోదగిన కూరగాయ మొక్కలల్లో టమాట మొక్కలు కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో టమాటాల ధర విపరీతంగా పెరిగిపోయిందన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. అసలు బయట మార్కెట్ లో టమాటాలను కొనుగోలు చేసే అవసరం లేకుండా మనం ఇంట్లోనే చాలా సులభంగా టమాట మొక్కలను పెంచుకోవచ్చు. ఇంట్లో టమాట మొక్కలను పెంచుకోవాలనుకునే వారు ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల టమాట కాయలు ఎక్కువగా కాసేలా చేసుకోవచ్చు.
ఇంట్లో టమాట మొక్కలను ఏ విధంగా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం బాగా పండిన టమాట నుండి గింజలను సేకరించి ఎండబెట్టాలి. తరువాత ఒక చిన్న కుండీలో లేదా ప్లాస్టిక్ గ్లాస్ లో మట్టిని తీసుకుని అందులో ఎండిన టమాట గింజలను వేసి వాటిపై కొద్దిగా మట్టిని చల్లాలి. తరువాత వీటిపై రోజు కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ ఉండాలి. అలాగే ఎండ తగిలే ప్రదేశంలో ఉంచాలి. గింజలు నాటిన 7 నుండి 10 రోజుల్లో మొలకలు వస్తాయి. ఈ మొలకలు 3 నుండి 6 ఇంచుల పొడవు పెరగానే వీటిని మరో పెద్ద కుండీలోకి మర్చాలి. టమాట మొక్కలు పెంచడానికి మట్టి బిగుసుకు పోకుండా గుల్ల గుల్లగా ఉండేలా చూసుకోవాలి. మట్టిని, కంపోస్ట్ ఎరువును, ఇసుకను, కొబ్బరి పీచును సమానంగా కలిపి కుండీలో వేసుకోవాలి. కుండీ నిండుగా మట్టిన పోయకూడదు. తరువాత టమాట మొలకలను అందులో ఉంచి పైనుండి మరి కొద్దిగా మట్టిని పోయాలి.
తరువాత వీటిని రోజూ నీటిని పోస్తూ ఉండాలి. ఇలా వారం రోజుల పాటు చేసిన తరువాత టమాట మొక్కలు కింద పడిపోకుండా వాటికి తీగలతో లేదా కర్రలతో ఆధారాన్ని ఇవ్వాలి. అలాగే ఈ మొక్కలకు వారానికి ఒకటి నుండి రెండు సార్లు పుల్లటి మజ్జిగను స్ప్రే చేస్తూ ఉండాలి. అలాగే బియ్యం కడిగిన నీటిని పోస్తూ ఉండాలి. అదే విధంగా అరటి పండు తొక్కలను నానబెట్టిన నీటిని పోస్తూ ఉండాలి. మధ్య మధ్యలో కంపోస్ట్ ఎరువును వేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల టమాట మొక్కలు చక్కగా, బలంగా పెరుగుతాయి. అలాగే పూత రాలిపోకుండా ఉంటుంది. టమాట మొక్కలకు కాయలు ఎక్కువగా వస్తాయి. టమాట మొక్కలు పెట్టిన 50 నుండి 60 రోజుల్లోనే టమాట కాయలను సేకరించి మనం వంటల్లో వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మన ఇంటికి సరిపడా టమాట కాయలను మనం ఇంట్లోనే చాలా సులభంగా పండించుకోవచ్చు.