Kasuri Methi : ప్రస్తుతం చాలా మంది వంటల్లో కసూరీ మేథీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది వేస్తే వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కనుకనే దీని వాడకం ఎక్కువైంది. అయితే దీన్ని ఇంట్లోనే మనం సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదట మెంతి ఆకులను పది నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత బాగా కడిగి శుభ్రమైన కాటన్ లేదా టవల్‌లో వేసి గట్టిగా నీరు పోయేలా పిండాలి. తడి మొత్తం బయటకు పోయేవరకు ఆరబెట్టాలి.
ఈ ఆకులను చిన్న ముక్కలుగా కోసి టిష్యూ పేపర్ లేదా కాగితంపై వేసి మూడు రోజుల పాటు ఆరబెట్టాలి. అయితే ఎంత తగలకుండా కేవలం గాలి మాత్రమే తగిలేలా చూడాలి. చివరగా ఈ ఆకులను గంటసేపటి వరకు ఎండలో ఆరబెడితే పొడి పొడిలా తయారవుతాయి. ఆ తరువా ఓవెన్‌లో ఒక నిమిషం పాటు పెట్టి బయటకు తీయాలి.
ఓవెన్ లేనివారు పెనంపై ప్లేట్ పెట్టి దాంట్లో ఈ ఆకులను వేసి ఒక నిమిషం పాటు వేడి చేయాలి. దీంతో కసూరీ మేథీ సిద్ధమవుతుంది. దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేసి నిల్వ చేసుకోవచ్చు. దీన్ని ఇలా తయారు చేసుకుంటే సుమారుగా 4 నుంచి 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. మెంతి ఆకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇలా కసూరీ మేథీ తయారు చేసుకుని వాడితే ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.