Kakinada Kaja : ఫేమ‌స్ కాకినాడ కాజా.. త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Kakinada Kaja : కాకినాడ గొట్టం కాజా.. ఇది ఎంత ప్రాచుర్యం పొందిందో మ‌నంద‌రికి తెలుసు. కాకినాడ గొట్టం కాజా చాలా రుచిగా ఉంటుంది. లోప‌ల జ్యూసీగా ఎంతో రుచిగా ఉండే ఈ కాజాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ గొట్టం కాజాను అదే స్టైల్ లో మం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. మొద‌టిసారి చేసే వారు కూడా ఈ గొట్టం కాజాను అదే రుచితో అంతే జ్యూసీగా త‌యారు చేసుకోవ‌చ్చు. కాకినాడ కాజాను అదే స్టైల్ లో అదే రుచితో ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కాకినాడ కాజా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదాపిండి – ఒక‌టిన్న‌ర క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – చిటికెడు, వంట‌సోడా – పావు టీ స్పూన్, బేకింగ్ పౌడ‌ర్ – అర టీ స్పూన్, నెయ్యి లేదా నూనె – పావు క‌ప్పు, పెరుగు – 2 టీ స్పూన్స్, పంచ‌దార – 2 క‌ప్పులు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పు.

Kakinada Kaja recipe in telugu make in this method
Kakinada Kaja

కాకినాడ కాజా తయారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ర‌వ్వ‌, వంట‌సోడా, బేకింగ్ పౌడ‌ర్, ఉప్పు, నెయ్యి, పెరుగు వేసి కల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ చ‌పాతీ పిండి కంటే మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 2 నుండి 3 గంట‌ల పాటు పిండిని నాన‌బెట్టాలి. త‌రువాత పంచ‌దార పాకానికి ఒక గిన్నెలో పంచ‌దార నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార క‌రిగి తీగ‌పాకం వ‌చ్చిన త‌రువాత యాల‌కుల పొడి వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ముందుగా క‌లిపిన పిండిని మ‌రోసారి బాగా క‌లుపుకుని 2 లేదా 3 భాగాలుగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో భాగాన్ని తీసుకుంటూ పొడి పిండి నూనె వేసుకుంటూ గుండ్రంగా, పొడ‌వుగా చేసుకోవాలి. తరువాత ఈ రోల్ ను చేత్తో కొద్దిగా ప్లాట్ గా అయ్యేలా వ‌త్తుకోవాలి.

త‌రువాత చాకుతో అంగుళం వెడ‌ల్పుతో ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత వీటిని నూనెలో వేసే ముందు చ‌పాతీ క‌ర్ర‌తో మ‌రి కొద్దిగా ప్లాట్ గా వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. త‌రువాత ఈ కాజాల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై లైట్ గోల్డెన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ కాజాలు కొద్దిగా చ‌ల్లారిన త‌రువాత మ‌ర‌లా నూనెలో వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. ఇలా కాల్చిన వెంట‌నే కాజాల‌ను తీసి పంచ‌దార పాకంలో వేసుకోవాలి. వీటిని ఒక‌టి లేదా 2 నిమిషాల పాటు పంచ‌దార పాకంలో ఉంచి ప్లేట్ లోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కాకినాడ కాజాలు త‌యార‌వుతాయి. ఈ కాజాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. పండగ‌ల‌కు లేదా తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా కాజాల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts