Onion Kurma : ఉల్లిపాయ‌ల‌తో ఎంతో టేస్టీగా ఉండే ఆనియ‌న్ కుర్మా.. ఇలా ఈజీగా చేసెయొచ్చు..

Onion Kurma : ఉల్లిపాయ‌ల‌ను మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుందన్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఉల్లిపాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా కుర్మాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌తో కుర్మాను త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. చాలా త‌క్కువ స‌మ‌యంలో, రుచిగా ఉల్లిపాయ‌ల‌తో కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆనియ‌న్ కుర్మా తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బ‌రి పొడి – 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, ట‌మాటాలు – 2, పాయ‌లుగా త‌రిగిన ఉల్లిపాయ – 1 ( పెద్దది), చింత‌పండు ర‌సం – పావు క‌ప్పు, నీళ్లు – 200 ఎమ్ ఎల్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Onion Kurma recipe in telugu how to make it
Onion Kurma

ఆనియ‌న్ కుర్మా త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక స‌న్న‌గా తరిగిన ఉల్లిపాయ వేసి వేయించాలి. ఉల్లిపాయ స‌గానికి పైగా వేగిన త‌రువాత జీడిప‌ప్పు, ఎండు కొబ్బ‌రి పొడి వేసి వేయించాలి. త‌రువాత నువ్వులు వేసి చిట‌ప‌ట‌లాడే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, గ‌రం మ‌సాలా, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీగా చేసుకుని వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి.

ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత చింత‌పండు ర‌సం వేసి క‌లపాలి. దీనిని ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత కొత్తిమీర వేసి చిన్న మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియ‌న్ కుర్మా త‌యార‌వుతుంది. దీనిని చ‌పాతీ, పుల్కా, అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు ఉల్లిపాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే కుర్మాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ కుర్మాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts