Potato Lollipops : సాయంత్రం సమయాలలో తినడానికి మనం వంటింట్లో అనేక రకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. మనకు ఇంట్లో తయారు చేసుకోవడానికి వీలుగా ఉండే చిరుతిళ్లలో పొటాటో లాలిపాప్స్ కూడా ఒకటి. బంగాళాదుంపలను ఉపయోగించి చేసే ఈ వంటకాన్ని అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ లాలిపాప్స్ ను తయారు చేయడం కూడా చాలా సులభం. బంగాళాదుంపలతో లాలిపాప్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొటాటో లాలిపాప్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 2 ( పెద్దవి), బ్రెడ్ క్రంబ్స్ – రెండు కప్పులు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), తరిగిన కరివేపాకు – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్న గా తరిగిన పచ్చి మిర్చి – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, మైదా పిండి – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
పొటాటో లాలిపాప్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఉడికించిన బంగాళాదుంపలను వేసి గడ్డలు లేకుండా మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత అందులో ఒక కప్పు బ్రెడ్ క్రంబ్స్ వేయాలి. తరువాత మైదా పిండి , నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో మిగిలిన బ్రెడ్ క్రంబ్స్ ను వేసుకోవాలి. అలాగే ఒక గిన్నెలో మైదా పిండిని వేసి తగినన్ని నీళ్లను పోస్తూ ఎక్కువగా పలుచగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు చేతులకు నూనెను రాసుకుంటూ తగినంత పరిమాణంలో బంగాళాదుంప మిశ్రమాన్ని తీసుకుని గుండ్రంగా ముద్దలుగా చేసుకోవాలి. ఇలా అన్ని ముద్దలు చేసుకున్న తరువాత ఒక్కో ముద్దను తీసుకుంటూ మైదా పిండి మిశ్రమంలో ముంచి వెంటనే బ్రెడ్ క్రంబ్స్ ను ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ ముద్దకు అంతా బ్రెడ్ క్రంబ్స్ అతుక్కునేలా చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనె బాగా కాగిన తరువాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముద్దలను వేసి మధ్యస్థ మంటపై తిప్పుతూ 2 నిమిషాల పాటు కాల్చుకుని టిష్యూ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా కాల్చుకున్న బంగాళాదుంప ముద్దలకు టూత్ పిక్స్ ను గుచ్చుకుని లాలిపాప్స్ లా తయారు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొటాటో లాలిపాప్స్ తయారవుతాయి. ఈ లాలిపాప్స్ తయారీలో ఉపయోగించిన బ్రెడ్ క్రంబ్స్ ను మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకు కావల్సినన్ని బ్రెడ్ ముక్కలను తీసుకుని వేయించి ముక్కలుగా చేసి జార్ లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా బ్రెడ్ క్రంబ్స్ తయారవుతాయి. వీటిని నేరుగా లేదా టమాట కెచప్ తో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి.