Rasam For Immunity : ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని అందించేందుక మనకు వర్షాకాలం వస్తుంది. అయితే ఈ కాలం మనకు అనేక రకాల వ్యాధులను కూడా మోసుకుని వస్తుంది. ఈ సీజన్‌లో మనకు దగ్గు, జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇందుకు రోగ నిరోధక శక్తి లేకపోవడం ప్రధాన కారణమని చెప్పవచ్చు. అలాగే కలుషిత ఆహారం తీసుకోవడం లేదా బయటి తిండి తినడం, ఇంట్లో పరిశుభ్రత లేకపోవడం, దోమలు కుట్టడం వంటి కారణాల వల్ల కూడా మనకు రోగాలు వస్తుంటాయి. అయితే ఇమ్యూనిటీని పెంచుకుంటే చాలు, మనం ఈ రోగాల నుంచి సులభంగా బయట పడవచ్చు.
మన శరీరం తగినంత ఇమ్యూనిటీ పవర్‌ను కలిగి లేకపోతే మనకు రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇమ్యూనిటీ లేకపోతే వచ్చిన రోగం కూడా ఒక పట్టాన తగ్గదు. కనుక రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం అవసరం. అయితే రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు మీరు ఎక్కువగా శ్రమించాల్సిన పనిలేదు. ఎందుకంటే మన ఇంట్లో లభించే పదార్థాలతోనే ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
మన వంట ఇంట్లో ఉండే పలు పదార్థాలతో రసం తయారు చేసి దాన్ని నేరుగా తాగవచ్చు. లేదా అన్నంలో కలిపి కూడా తినవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. ఈ రసంలో ఉపయోగించబడే పదార్థాలు అన్నీ సహజసిద్ధమైనవే. కనుక మనం రోగాల నుంచి త్వరగా కోలుకుంటాం. ఇక ఆ రసాన్ని ఎలా తయారు చేయాలి, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని టమాటాలను, నల్ల మిరియాలను, అల్లం, వెల్లుల్లిని, జీలకర్ర, చింతపండు, కొత్తిమీర ఆకులను తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. తరువాత ఒక పాత్ర తీసుకుని అందుల కాస్త నెయ్యి వేసి వేడి వేయాలి. నెయ్యి వేడయ్యాక అందులో కాస్త ఇంగువ వేయాలి. అందులోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు, ఎండు మిర్చి వేసి చిటపటలాడే వరకు వేయించాలి. అనంతరం అందులో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. దీన్ని 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించాలి. అనంతరం అందులో ఉప్పు, రసం పొడి వేయాలి. తరువాత నీళ్లు కలిపి ఉడికించాలి. అవసరం అనుకుంటే నీళ్లను కాస్త ఎక్కువగానే వేయవచ్చు. తరువాత స్టవ్‌ను మీడియం మంటపై ఉంచి సుమారుగా 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అనంతరం కొత్తిమీర ఆకులను మీద వేసి గార్నిష్ చేయాలి. దీంతో వేడి వేడి రసం తయారవుతుంది.
ఇలా రెడీ అయిన రసాన్ని నేరుగా తాగవచ్చు. లేదా అన్నంతోనూ కలిపి తినవచ్చు. దగ్గు, జలుబు, జ్వరం సమస్యలు ఉన్నవారు ఈ రసాన్ని తాగడం వల్ల త్వరగా కోలుకుంటారు. ముక్కు దిబ్బడ, ఆస్తమా నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ఈ రసంలో వాడే మసాలాలు, వంట దినుసులు, పదార్థాల వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో శరీరం ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఫలితంగా వ్యాధులు తగ్గుతాయి. కనుక ఈ రసాన్ని మీరు తయారు చేసి తీసుకోండి. ఫలితాన్ని మీరే చూస్తారు.