Ravva Bonda Bajji : రవ్వతో మనం రకరకాల చిరుతిళ్లను, స్నాక్స్ ను తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసే స్నాక్స్ చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. ఇలా రవ్వతో చేసుకోదగిన వాటిల్లో రవ్వ బోండా బజ్జీలు కూడా ఒకటి. ఈ బోండా బజ్జీలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేయడం చాలా సులభం. 15 నిమిషాల్లోనే వీటిని తయారు చేసుకోవచ్చు. రవ్వతో తరుచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ రవ్వ బోండా బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ బోండా బజ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, మైదాపిండి – పావు కప్పు, పెరుగు – అర కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం తరుగు – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, జీలకర్ర – అర టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
రవ్వ బోండా బజ్జీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రవ్వను తీసుకోవాలి. తరువాత ఇందులో మైదాపిండి, పెరుగు, తగినన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత రవ్వను మరోసారి కలుపుకుని ఇందులో మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీటిని పోసి కలిపి గంటె జారుడుగా ఉండేలా చూసుకోవాలి.
తరువాత కళాయిలో నూనెపోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని చిన్న చిన్న బోండాల ఆకారంలో నూనెలో వేసుకోవాలి. తరువాత వీటిని 2 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత అటూ ఇటూ కదుపుతూ వేయించాలి. ఈ బోండాలు ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ బోండా బజ్జీ తయారవుతుంది. వీటిని నేరుగా ఇలాగే తినవచ్చు. లేదంటే టమాట కిచప్, పల్లీ చట్నీతో కూడా తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన బోండా బజ్జీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.