Rose Laddu : మనం ఎండు కొబ్బరి పొడిని వంట్లలో విరివిరిగా వాడుతూ ఉంటాము. అలాగే దీనితో మనం తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. కొబ్బరి పొడితో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో రోజ్ లడ్డూ కూడా ఒకటి. రోజ్ లడ్డూ చాలా రుచిగా, కలర్ ఫుల్ గా ఉంటాయి.స్పెషల్ డేస్ లో, పండగల సమయంలో చేసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ లడ్డూలను కేవలం 15 నిమిషాల్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత కమ్మగా ఉండే ఈ రోజ్ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజ్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టీ స్పూన్స్, ఎండు కొబ్బరి పొడి – 2 కప్పులు, చిక్కటి పాలు – అర లీటర్, పంచదార – అర కప్పు, రోజ్ సిరప్ – 3 టీ స్పూన్స్.
రోజ్ లడ్డూ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక ఎండు కొబ్బరి పొడి వేసి వేయించాలి. దీనిని కొద్దిగా రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో పాలు పోసి వేడి చేయాలి. పాలు కొద్దిగా చిక్కబడిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత వేయించిన కొబ్బరి పొడి వేసి కలపాలి. ఈ కొబ్బరి మిశ్రమాన్ని కళాయికి అంటుకోకుండా వేరయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో నుండి పావు వంతు భాగాన్ని ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మిగిలిన కొబ్బరి మిశ్రమంలో రోజ్ సిరప్ వేసి కలపాలి. తరువాత రోజ్ సిరప్ వేసిన కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుని చెక్క అ్పలాగా వత్తుకోవాలి. దీని మధ్యలో ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి ఉండను ఉంచి అంచులను మూసేసి లడ్డూలాగా వత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల కలర్ ఫుల్ గా ఎంతో రుచిగా ఉండే రోజ్ లడ్డూ తయారవుతుంది. తీపి తినాలనిపించిపనప్పుడు అప్పటికప్పుడు ఇలా రుచిగా రోజ్ లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.