Venna Undalu : సంప్ర‌దాయ వంట‌కం.. వెన్న ఉండ‌లు.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతాయి..!

Venna Undalu : మ‌నం బియ్యంతో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము.బియ్యం పిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో వెన్న ఉండ‌లు కూడా ఒక‌టి. వెన్న ఉండ‌లు క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా పాత‌కాలంలో త‌యారు చేసే వారు. వెన్న ఉండ‌ల‌ను ఎవ‌రైనా చాలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఇంట్లో అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. పాత‌కాల‌పు వంట‌క‌మైన ఈ వెన్న ఉండ‌ల‌ను రుచిగా, సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెన్న ఉండ‌ల త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

బియ్యం – ఒక క‌ప్పు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్, ఉప్పు – చిటికెడు, వెన్న – పావు క‌ప్పు, కాచి చ‌ల్లార్చిన పాలు – పావు క‌ప్పు, బెల్లం – ముప్పావు క‌ప్పు, యాల‌కుల పొడి -అర టీ స్పూన్.

Venna Undalu recipe in telugu make like this
Venna Undalu

వెన్న ఉండ‌ల త‌యారీ విధానం..

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా క‌డిగి త‌గిన‌న్ని నీళ్లు పోసి 6 గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత వీటిని వ‌డ‌క‌ట్టి ఫ్యాన్ గాలికి ఆర‌బెట్టాలి. బియ్యం త‌డి ఆరిన త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ పిండిని జ‌ల్లించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, మైదాపిండి వేసి క‌ల‌పాలి. త‌రువాత వెన్న వేసి క‌ల‌పాలి. త‌రువాత పాలు పోసుకుంటూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకోవాలి. ఉండ‌లు ప‌గుళ్లు లేకుండా చూసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మ‌ధ్య‌స్థంగా వేడ‌య్యాక ఉండ‌ల‌ను వేసి కాల్చుకోవాలి.

వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై గోల్డెన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో బెల్లం తురుము, పావు క‌ప్పు కంటే కొద్దిగా త‌క్కువ నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగి ముదురు పాకం వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. బెల్లం పాకం రాగానే యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన ఉండలు వేసి క‌లిపిస్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని పొడి పొడిగా అయ్యి ఒక‌దాని నుండి ఒక‌టి వేర‌య్యే వ‌ర‌కు నెమ్మ‌దిగా క‌లుపుతూ ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెన్న ఉండలు త‌యార‌వుతాయి. వీటిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా వెన్న ఉండ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts