RRR Movie Review : దర్శక ధీరుడు రాజమౌళి చిత్రం అంటేనే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి, ఉత్కంఠ నెలకొంటాయి. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఆ సినిమాలన్నీ ఒక రేంజ్‌లో ఉంటాయి. ప్రేక్షకులకు కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌లభిస్తుంది. హై వోల్టేజ్ సన్నివేశాలు ఉంటాయి. కనుక జక్కన్న చెక్కే చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎక్కువగా లభిస్తుంది. ఇక మరో చిత్రంతో ఆయన ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
కథ..
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమురం భీమ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఇద్దరూ 1918 నుంచి 1920 వరకు 2 ఏళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా అదృశ్యమైపోతారు. వారు ఎక్కడికి వెళ్లిందీ ఎవరికీ తెలియదు. తరువాత వీరు విప్లవ వీరుల్లా మారి బ్రిటిష్ వారిపై పోరాటం చేస్తారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది ? అన్నదే చిత్ర కథ. ఇందులో ఎన్‌టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరిగా నటించారు.
1920లలో తెలంగాణలో ఉన్న ఆదిలాబాద్‌లోని ఓ గిరిజన ప్రాంతంలో చిత్ర కథ ముందుగా ప్రారంభమవుతుంది. నిజాంను కలిసేందుకు వచ్చిన ఓ బ్రిటిష్ అధికారి అక్కడి ఓ గిరిజన బాలికను బలవంతంగా లాక్కెళ్తాడు. ఈ క్రమంలో వారికి నాయకుడిలా ఉంటున్న కొమురం భీమ్ (ఎన్టీఆర్) ఈ విషయం తెలుసుకుని ఆ బాలికను రక్షించేందుకు వెళ్తాడు. ఆమె ఢిల్లీలో ఉందని తెలుసుకుంటాడు. ఈ క్రమంలోనే ఢిల్లీలో అడుగుపెట్టి అక్కడ విధ్వంసం చేసి ఆ బాలికను రక్షిస్తాడు. దీంతో కొమురం భీమ్‌ను పట్టుకునే బాధ్యతను సీతారామరాజు (చరణ్)కు బ్రిటిష్ ప్రభుత్వం అప్పగిస్తుంది. ఈ క్రమంలోనే ఓ దశలో కొమురం భీమ్‌ను కలిసిన రామరాజు అతనిలో ఉన్న నిజాయితీకి ఆశ్చర్యపోతాడు. తరువాత భీమ్‌కు రాజు సహాయం చేస్తాడు. అయితే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినందుకుగాను సీతారామరాజుకు ఆ ప్రభుత్వం ఉరిశిక్ష విధిస్తుంది.
ఇక రామరాజుకు ఉరిశిక్ష పడ్డ విషయం భీమ్‌కు తెలియదు. ఓ సందర్భంలో అతను సీతను కలుస్తాడు. ఆమె పెట్టిన సద్ది తిని ఆకలి తీర్చుకుంటాడు. ఈ క్రమంలోనే రామరాజుకు ఉరి శిక్ష పడ్డ విషయం తెలుస్తుంది. దీంతో రాముడికి కష్టం వస్తే వెళ్లాల్సింది సీత కాదు.. లక్ష్మణుడు.. అంటూ భీమ్ ముందుకు సాగుతాడు. తరువాత మళ్లీ భీమ్ బ్రిటిష్ వారిపై దాడి చేసి ఎట్టకేలకు రామరాజును జైలు నుంచి బయటకు తీసుకువస్తాడు. ఈ క్రమంలోనే వీరి స్నేహం మొదలవుతుంది. అయితే చివరకు వీరిద్దరూ ఏం చేశారు ? బ్రిటిష్ వారిపై ఎలా పోరాటం చేశారు ? అన్నదే మిగిలిన చిత్ర కథ. కనుక పూర్తిగా తెలుసుకోవాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
ఇక నటీనటుల పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తమ అద్భుతమైన నటనతో మరోమారు ఆకట్టుకున్నారు. వీరు కనిపించే ప్రతి సీన్ ఆద్యంతం అలరిస్తుంది. వీరి రెండు పాత్రలను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దారు. తెరపై ఒక్కో సీన్‌ను చూస్తుంటే ఎంత ఉన్నతంగా తెరకెక్కించారో అర్థమవుతుంది. సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలు ఉంటాయి. అవే ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ సినిమాకు ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ రెండు కళ్లులా మారి సినిమాను అద్భుతంగా వచ్చేలా చేశారు. ఇక ఈ రెండు పాత్రల మధ్య ఉండే బంధాన్ని దర్శకుడు రాజమౌళి బాగా హైలైట్ చేసి చూపించారు. అందువల్ల వీరు కలసి ఉండే సీన్లు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చు.
అయితే చిత్రంలో ఆలియా భట్ పాత్ర నిడివి తక్కువే. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి ముందు నుంచే చెబుతూ వస్తున్నారు. కానీ చిత్రానికి ఈమె పాత్రనే కీలకమలుపు అని చెప్పవచ్చు. ఆలియాభట్ కూడా తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేసింది. అలాగే అజయ్ దేవగన్ కూడా అద్భుతంగా నటించారు. వీరితోపాటు ఒలివియా మోరిస్, శ్రియ వంటి నటీనటులు కూడా తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు.
ఈ సినిమాకు దర్శకుడు రాజమౌళి అన్నీ తానే అయి ముందుండి నడిపించినట్లు సినిమాను చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీ భారతీయ సినిమా సత్తాను మరోమారు ప్రపంచానికి చాటుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ ప్రాజెక్టును డీల్ చేయడం సామాన్యమైన విషయం కాదు. కానీ రాజమౌళి దాన్ని ఓపిగ్గా ఓ శిల్పంలా మలిచారు. అలాగే చిత్రంలోని పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. నాటు నాటు సాంగ్ ఉరకలెత్తిస్తుంది. కథ చాలా బలమైంది. ఇంటర్వెల్‌కు ముందు బ్లాక్‌ను చక్కగా చూపించారు. ఇక కీరవాణి సంగీతంతోపాటు గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.
ఈ చిత్రంలో సెకండాఫ్ చాలా స్లోగా సాగుతుంది. అదొక్కటే మైనస్ పాయింట్. అయినప్పటికీ అదేమీ బాగా ప్రభావం చూపించదు. మూవీలో చరణ్, ఎన్‌టీఆర్‌లు ఫైట్ చేసుకునే సీన్లలో ప్రేక్షకులకు కన్నీళ్లు వస్తాయి. చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా తాజాగా ఇంటర్వ్యూల్లో ఇదే చెప్పారు. ఇక మొత్తంగా చూస్తే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఒక క్లాసిక్ అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను కచ్చితంగా ఒకసారి చూసి తీరాల్సిందే.