Shilpa Shetty : బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి కష్టాలు తప్పడం లేదు. తన భర్త అశ్లీల చిత్రాల కేసులో అరెస్టు అయి విచారణను ఎదుర్కొంటున్నాడు. అప్పటి వరకు ఎంతో సాఫీగా సాగిపోయిన ఆమె జీవితం ఒక్క సారిగా మలుపు తిరిగింది. భర్త ఆ కేసులో అరెస్టు కావడంతో శిల్పాశెట్టికి ఘోర అవమానమే జరిగిందని చెప్పవచ్చు. దీంతో ఆమె తలెత్తుకోలేకపోయింది. కొన్ని రోజుల పాటు అసలు బయటకు రాలేదు. ఇక ఆ కేసు విచారణ, దానికి సంబంధించిన వార్తలు మీడియాలో పెద్దగా రావడం లేదు. దీంతో ఇప్పుడిప్పుడే శిల్పాశెట్టి మళ్లీ బయట కనిపిస్తోంది.
అయితే శిల్పాశెట్టి తాజాగా మళ్లీ ఓ వివాదంలో చిక్కుకుంది. చూస్తుంటే ఆమెకు కష్టాలు తప్పేలా లేవని తెలుస్తోంది. శిల్పా శెట్టి తండ్రి సురేంద్ర శెట్టి 2015లో ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని ఫర్హద్ అమ్రా నుండి రూ.21 లక్షలు అప్పు తీసుకున్నారు. ఈ క్రమంలోనే 2017 జనవరి వరకు ఆ రుణాన్ని చెల్లించేయాలని వారి మధ్య ఒప్పందం జరిగింది.
అయితే సురేంద్ర శెట్టి 2016 అక్టోబర్ 11న మరణించారు. దీంతో ఆయన తీసుకున్న అప్పు అలాగే మిగిలిపోయింది. అయితే ఈ విషయం శిల్పా శెట్టితోపాటు ఆమె సోదరి షమితా శెట్టి, తల్లికి కూడా తెలుసని, అయినప్పటికీ వారు అప్పు చెల్లించలేదని.. కనుక తనకు న్యాయం చేయాలని కోరుతూ ఫర్హద్ అమ్రా ఇటీవల జుహూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శిల్పాశెట్టికి, ఆమె సోదరి, తల్లికి నోటీసులు జారీ చేశారు. దీంతో వారు ఈ నెల 28న కేసు విచారణ నిమిత్తం కోర్టులో హాజరు కావాలని ఆదేశించారు.