Vankaya Vellulli Karam : వంకాయ ఉల్లికారం.. వంకాయలతో చేసే ఈ ఉల్లికారం చాలా రుచిగా ఉంటుంది. దీని రుచి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది ఈ ఉల్లికారం. వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే ఈ కారం చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. రుచితో పాటు వెన్నలా కరిగిపోయేలా ఉండే ఈ వంకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ ఉల్లికారం తయారీకి కావల్సిన పదార్థాలు..
నల్లటి గుత్తి వంకాయలు – 100 గ్రా., ఉల్లిపాయలు – 3 పెద్దవి, జీలకర్ర – ఒక టీ స్పూన్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – పావు కప్పు, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, లవంగాలు – 5.
వంకాయ ఉల్లికారం తయారీ విధానం..
ముందుగా గుత్తి వంకాయలను నాలుగు భాగాలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. తరువాత జార్ లో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం తరుగు, కారం, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత వంకాయలు వేసి మూత పెట్టి వేయించాలి. వీటిని చిన్న మంటపై మధ్య మధ్యలో కలుపుతూ 10 నుండి 15 నిమిషాల పాటు వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఉల్లికారాన్ని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను మాత్రమే ఉంచి మిగిలిన నూనెను గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించాలి. తరువాత స్టఫ్ చేసుకున్న వంకాయలు, మిగిలిన కారం వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి చిన్ మంటపై వంకాయలు మెత్తగా అయ్యి కారం ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. ఇలా 15 నుండి 18 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ ఉల్లికారం తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయలతో తరుచూ మసాలా కూరలే కాకుండా ఇలా ఉల్లికారాన్ని కూడా తయారు చేసి తీసుకోవచ్చు.