Pine Apple : మన ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వైద్యులు కూడా మనకు పండ్లను తినమని సూచిస్తూ ఉంటారు. మనం ఆహారంగా తీసుకునే పండ్లలో పైనాపిల్ కూడా ఒకటి. పైనాపిల్ తీపి, పులుపు రుచులను కలిగి ఉంటుంది. దీంట్లో కూడా శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. పైనాపిల్ ను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పైనాపిల్ ను తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పైనాపిల్ లో విటమిన్ ఎ, విటమిన్ సి తోపాటు కాల్షియం, ఐరన్, సోడియం వంటి మినరల్స్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి. పైనాపిల్ ను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. అలాగే అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
ఎముకలను దృఢంగా ఉంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా పైనాపిల్ మనకు ఉపయోగపడుతుంది. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగించి క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో పైనాపిల్ మనకు ఎంతగానో సహాయపడుతుంది. దీంట్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంచి అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. పైనాపిల్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటాం. తరుచూ ఇన్ ఫెక్షన్ ల బారిన పడే వారు, జ్వరాలతో బాధపడే వారు అలాగే పచ్చ కామెర్ల బారిన పడిన వారు పైనాపిల్ ను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి శరీర భాగాలకు ఆక్సిజన్ సక్రమంగా సరఫరా అయ్యేలా చేయడంలో కూడా పైనాపిల్ ఉపయోగపడుతుంది. కండరాల వాపులతో బాధపడే వారు పైనాపిల్ ను తినడం వల్ల వాపుల నుండి ఉపశమనం లభిస్తుంది. తరచూ పైనాపిల్ ను తినడం వల్ల జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. పైనాపిల్ గుజ్జును ముఖానికి రాసుకుని అరగంట తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.
అయితే రుచిగా ఉంది కదా అని పైనాపిల్ ను ఎక్కువగా తినకూడదు. దీనిని ఎక్కువగా తినడం వల్ల తలనొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. గర్భిణీలు పైనాపిల్ ను తినకపోవడమే మంచిది. ఈ విధంగా పైనాపిల్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.