Bread Halwa : మనం బ్రెడ్ ను కూడా తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటుంటాం. బ్రెడ్ తో సాండ్ విచ్ లను, బ్రెడ్ రోల్స్ వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాం. అంతేకాకుండా బ్రెడ్ తో ఎంతో రుచిగా తీపి పదార్థాలను తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసే తీపి పదార్థాలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది డబుల్ కా మీఠా. ఇదే కాకుండా బ్రెడ్ తో బ్రెడ్ హల్వాను కూడా చేసుకుని తినవచ్చు. బ్రెడ్ హల్వాను తయారు చేయడం చాలా సులభం. బ్రెడ్ హల్వాను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ – 6 ముక్కలు, జీడిపప్పు – కొద్దిగా, బాదం పలుకులు – కొద్దిగా, ఎండు ద్రాక్ష- కొద్దిగా, నెయ్యి – 4 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒక కప్పు, పంచదార – ఒక కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
బ్రెడ్ హల్వా తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తరువాత డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించాలి. వేయించిన డ్రై ఫ్రూట్స్ ను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ బ్రెడ్ ను రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న బ్రెడ్ ను ముక్కలుగా చేసుకోవాలి. తరువాత అదే కళాయిలో పంచదారను, నీళ్లను పోసి చిన్న మంటపై పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత బ్రెడ్ ముక్కలను వేయాలి.
పంచదార మిశ్రమాన్ని బ్రెడ్ ముక్కలు అంతా పీల్చుకునే వరకు తిప్పుతూ ఉండాలి. బ్రెడ్ ముక్కలు మెత్తగా అయిన తరువాత బ్రెడ్ ను మరింత చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ ను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ హల్వా తయారువుతుంది. ఈ బ్రెడ్ హల్వాలో ఒక కప్పు లేదా తగినన్ని కాచి చల్లార్చిన పాలను పోసి బాగా కలపడం వల్ల డబుల్ కా మీఠా తయారవుతుంది. ఈ విధంగా తీపి తినాలనిపించినప్పుడు చాలా త్వరగా, చాలా రుచిగా బ్రెడ్ హల్వాను తయారు చేసుకుని తినవచ్చు.