Mosambi Juice : మనకు విరివిగా దొరికే పండ్లలో బత్తాయి ఒకటి. దీనినే మోసంబి అని కూడా పిలుస్తారు. చాలా మంది తమ ఆహారంలో దీనికి అంతగా ప్రాముఖ్యం ఇవ్వరు. కానీ దీనిలో ఉండే మంచి ఆరోగ్యకర గుణాలు తెలిస్తే ఎవరూ నిర్లక్ష్యం చేయరని ఆహార నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒకటి లేదా రెండు గ్లాసుల బత్తాయి రసం ఆహారంలో భాగం చేసుకోవడం వలన రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని సలహా ఇస్తున్నారు.
అలాగే బత్తాయిలో పుష్కలంగా ఉండే సిట్రిక్ యాసిడ్ జంక్ ఫుడ్ తినాలనే కోరికలను రానివ్వదు. బత్తాయి ద్వారా మన శరీరానికి అతి తక్కువ క్యాలరీలు అందుతాయి. దాని వలన బరువు పెరగడం అనేది ఉండదు. ఇంకా మోసంబి వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 100 గ్రాముల బత్తాయిలో కేవలం 25 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అలాగే 8.4 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 0.4 గ్రాముల ఫైబర్, 0.1 గ్రాముల కొవ్వు, 117 మిల్లీ గ్రాముల పొటాషియం, 14 మిల్లీ గ్రాముల కాల్షియం, 14 మిల్లీ గ్రాముల ఫాస్పరస్ ఇంకా ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా కెరోటిన్లు ఉంటాయి.
బత్తాయి రసం ఆకలిని తగ్గించడానికి పనిచేస్తుంది. ఇంకా దీనిలోని సిట్రిక్ యాసిడ్ శరీర జీవక్రియలను మెరుగు పరచి దాని ద్వారా శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. బత్తాయి రసం ఆకలిని కూడా తగ్గిస్తుంది. 200 మి.లీ.ల మోసంబి జ్యూస్ లో 31 క్యాలరీలు ఉంటాయి. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా ఆహారం తీసుకోని విరామ సమయాల్లో తీసుకోవచ్చు. దీనిలోని విటమిన్ సి దగ్గు, జలుబుల నుండి కాపాడటం మాత్రమే కాకుండా శరీరానికి కొవ్వును వేగంగా కరిగించుకునే శక్తిని కూడా ఇస్తుంది.
దీనిలోని ఫైబర్ త్వరగా కడుపు నిండిపోయిన భావనను కలిగిస్తుంది. వ్యాయామం చేసే వారు కూడా ముందుగా బత్తాయి రసం తాగాలని న్యూట్రిషన్ నిపుణులు సూచిస్తున్నారు. దాని వలన త్వరగా అలసి పోకుండా ఉంటారని చెబుతున్నారు. ఇంకా ఇది శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు బత్తాయి జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ముందుగా 6 లేదా 7 మోసంబిలను తీసుకొని తొక్కను తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలను జ్యూసర్ లో తీసుకొని వాటిలోని రసం అంతా వచ్చే వరకు తిప్పుకోవాలి. తరువాత ఆ రసాన్ని జ్యూసర్ నుండి వేరు చేసుకొని ఒక పాత్రలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ రసంలో కొద్దిగా నల్ల ఉప్పు, కొంచెం జీలకర్ర పొడిని వేసి కలుపుకోవాలి. రుచికి తగ్గట్టుగా కొంచెం చాట్ మసాలాను కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా జ్యూస్ తయారవుతుంది. ఇలా చేసుకున్న జ్యూస్ ను రోజూ రెండు గ్లాసులు తీసుకోవడం వలన త్వరగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. కనుక మోసంబి జ్యూస్‌ను రోజూ తాగితే ఎన్నో లాభాలను పొందవచ్చు.