Ariselu : మనం వివిధ రకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. అలాగే మనకు కొన్ని సాంప్రదాయ పిండి వంటకాలు కూడా ఉంటాయి. వాటిల్లో అరిసెలు కూడా ఒకటి. వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటారు. ఈ అరిసెలను రుచిగా, మెత్తగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అరిసెల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కిలో, బెల్లం తురుము – ముప్పావు కిలో, నీళ్లు – తగినన్ని, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
అరిసెల తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 10 నుండి 12 గంటల పాటు నానబెట్టాలి. తరువాత బియ్యంలోని నీటినంతటినీ వడకట్టాలి. తరువాత ఈ బియ్యాన్ని పిండి పట్టించాలి. వీలైన వారు మిక్సీలో వేసి కూడా పిండిలా చేసుకోవచ్చు. ఈ పిండిని కూడా జల్లించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం, నీళ్లు వేసి బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తరువాత లేత పాకం కంటే కొద్దిగా ఎక్కువ పాకం వచ్చే వరకు ఉడికించాలి.
బెల్లం మిశ్రమాన్ని నీళ్లల్లో వేస్తే పాకం ముద్దలా తయారవ్వాలి. ఇలా ముద్దగా వచ్చే వరకు బెల్లాన్ని ఉడికించాలి. పాకం వచ్చిన తరువాత జల్లెడ పట్టిన బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలిపిన తరువాత యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. బెల్లం, బియ్యం పిండి మిశ్రమం ఆరిన తరువాత గట్టిగా అవుతుంది. కనుక కొద్దిగా పలుచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేయాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని కావల్సిన పరిమాణంలో తీసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు పేపర్ లేదా కవర్ ను తీసుకుని నెయ్యి లేదా నూనె రాస్తూ అరిసెల ఆకారంలో వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయిని ఉంచి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అరిసెలను వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై కాల్చుకోవాలి. అరిసెలు కాలిన తరువాత రెండు గంటెలను తీసుకుని వాటి మధ్యలో అరిసెలను ఉంచి గట్టిగా వత్తాలి.
ఇలా చేయడం వల్ల అరిసెల్లో ఎక్కువగా ఉండే నూనె తొలగిపోతుంది. అరిసెలు ఎక్కువ నూనెను పీల్చుకుంటాయి. కనుక వాటిని కాల్చిన తరువాత నూనె పోయేలా తప్పకుండా వత్తాలి. ఇలా చేయడం వల్ల రుచిగా మెత్తగా ఉండే అరిసెలు తయారవుతాయి. వీటిని తడి అలాగే గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి.